Ganesh Chaturthi 2024: భారత దేశంలో అత్యంత ప్రత్యేకమైన గణేష్ విగ్రహాలలో ముంబైకి చెందిన లాల్‌బాగ్చా రాజా ఒకటి. లాల్‌బాగ్చా రాజా గణేష్ మండపాన్ని ప్రతీ సంవత్సరం ఒక ప్రత్యేకమైన థీమ్ తో సిద్ధం చేయబడుతుంది. ఈ గణేషుడిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి వేలాది భక్తులు వస్తారు. 1934 నుంచి లాల్‌బాగ్చా రాజాను ప్రతిష్ఠిస్తున్నారు. 1934లో ముంబైలోని లాల్బాగ్ మార్కెట్ లోని వ్యాపారులు గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించడం ప్రారంభించారు. ఈ గణేషుడిని 'కింగ్ ఆఫ్ లాల్ బాగ్' అని కూడా పిలుస్తారు.
లాల్‌బాగ్చా రాజా కు 15 కోట్ల బంగారు కిరీటం
ఈ సంవత్సరం ముంబై లాల్‌బాగ్చా రాజా విగ్రహం మరింత ఆకర్షణీయంగా నిలిచింది. 20 కేజీల బంగారు కిరీటంతో లాల్‌బాగ్చా రాజా గణేషుడిని అలంకరించారు. 15 కోట్లు విలువ చేసే ఈ బంగారు కిరీటాన్ని దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీ బహుమతిగా ఇచ్చినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
లాల్‌బాగ్చా రాజా గణేషుడితో అంబానీ కుటుంబానికి 15 ఏళ్ళ అనుబంధం ఉంది. ప్రతీ ఏడాది లాల్‌బాగ్చా ఉత్సవ వేడుకల్లో అంబానీ కుటుంబం పాల్గొంటుంది. అంతే కాదు అనంత్ అంబానీ లాల్‌బాగ్చా రాజా కమిటీకి కార్యనిర్వాహక సలహాదారుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.