Ganesh chaturthi: దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా గణపతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యయి. మహానగరాలతోపాటు మారుమూల పల్లెల్లో బొజ్జ గణపయ్య నామ స్మరణ మారుమోగుతోంది. ఇప్పటికే గణేశుడి మండపాలు కొలువుదీరగా ఉదయం 6 గంటలనుంచే భక్తుల దర్శనాలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. 70వ ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది ఖైరతాబాద్ లో 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శిల్పి చినస్వామి రాజేంద్రన్.. గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోశారు. పెద్దు ఎత్తున హాజరైన భక్తులు, ఉత్సవ కమిటీ గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి బలి తీసి పూజలు ప్రారంభించారు.
ఈఏడాది ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి అధిక సంఖ్యలోభక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు సైఫాబాద్ ఏసీపీ ఆర్ సంజయ్ కుమార్ తెలిపారు. శని, ఆదివారాలు రెండు సార్లు రావడంతో ముందస్తు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తొలిరోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్‌లు పూజలు చేయనున్నారు. 24 గంటల పాటు 3 షిఫ్టుల్లో పోలీసులు విధులు నిర్వహించనుండగా.. ముగ్గురు డీఎస్పీలు, 13 మంది ఇన్‌స్పెక్టర్లు, 33 మంది ఎస్‌ఐలు, 22 ప్లాటూన్ల సిబ్బంది పనిచేయనున్నట్లు సంజయ్ కుమార్ తెలిపారు.