Joe Biden: జీ20 సమ్మిట్ కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ఆయనకు పలువురు కేంద్రమంత్రులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బైడెన్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతికి కార్యక్రమాలను కాసేపు ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆయన బస చేయనున్న హాటల్ మౌర్య షెర్టాన్‌కు తన బీస్ట్ కారులో బయలుదేరారు. అనంతరం ప్రధాని మోదీ నివాసంలో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. బైడెన్ రాకతో ఢిల్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బైడెన్ ఇదే తొలిసారి భారత్‌కు రావడం.
మరోవైపు ఇప్పటికే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆస్ట్రేలియా ప్రధాని అంటోని అలబెన్స్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ ప్రధాని పుమియో కిషిదా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఈజిప్ట్ ప్రధాని అబ్దుల్ ఫతా, ఇతర దేశాధినేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. అటు ప్రధాని మోదీ నివాసంలో బంగ్లా ప్రధాని హసీనా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు, రక్షణ సహకరం వంటి అంశాలపై చర్చించినట్లు మోదీ తెలిపారు. గత తొమ్మిదేళ్లలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగయ్యాయని వెల్లడించారు.
జీ20 దేశాల్లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యన్ ఫెడరేషన్, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ, యూకే, అమెరికా దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ ఉన్నాయి.
ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఐటీసీ మౌర్యలోని 14వ అంతస్తులో బస చేస్తున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు శాంగ్రీలా హోటల్‌లో వసతి కల్పించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ద లలిత్ హోటల్‌లో బస కల్పించగా.. జపాన్ ప్రధాని పుమియో కిషిదా కూడా ఇక్కడే ఉండనున్నారు. ఇక ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌కు ఇంపీరియల్ హోటల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు క్లారిడ్జెస్, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌కు ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో బస ఏర్పాట్లు చేశారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు గురుగ్రామ్‌లోని ఒబెరాయ్ హోటల్‌లో వసతి కల్పించారు. మరోవైపు.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కోసం తాజ్ హోటల్‌లో వసతి ఏర్పాట్లు చేయగా.. ఆయన G20 సదస్సుకు హాజరుకావడం లేదు. జిన్‌పింగ్‌కు బదులుగా చైనా ప్రధాని లీ కియాంగ్ వస్తుండటంతో ఆయన బృందానికి తాజ్ హోటల్‌లో వసతి కల్పించారు.
ఇది కూడా చదవండి: జీ20 అతిథులకు ఇడ్లీ. చిట్టిగారె, మసాలా దోశె!