Venkaiah Naidu - Padma Vibhushan Award Winner: ఏ రంగంలోనైనా అందులోనూ రాణించాలంటే.. విశ్వసనీయత చాలా ముఖ్యం. తన గౌరవాన్ని కాపాడుకుంటూనే.. తనకిచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం అవసరం. అణకువగా ఉంటూనే, అవసరమైన చోట దూకుడు చూపించగలగాలి. అంతకు మించి నడవడికలో ఎప్పుడూ చిన్న తప్పిదం కూడా కనిపించకుండా చూసుకోవాలి. ఇన్ని లక్షణాలు.. ఉండే రాజకీయనాయకులు మన దేశంలో చాలా అరుదు. అందులోనూ సమకాలీన రాజకీయాల్లో.. మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రాజకీయ నాయకుడు ఎవరు అని అడిగితే ఎక్కువ శాతం మంది కచ్చితంగా చెప్పే పేరు ముప్పవరపు వెంకయ్య నాయుడు (Muppavarapu Venkaiah Naidu). అచ్చ తెలుగు నడవడిక.. స్వచ్ఛమైన చిరునవ్వు.. సంప్రదాయపు పంచె కట్టు.. చూడగానే ఎవరినైనా కట్టిపడేసే రూపం.. మాటల్లో తేట తెలుగు తీయదనం.. స్పష్టమైన వాచికం.. గంభీరమైన కంఠ స్వరం.. వీటికి తోడుగా విశ్వసనీయతకు.. నిజాయతీకి నిలువుటద్దం వెంకయ్యనాయుడు.
రిపబ్లిక్ డే 2024 సందర్భంగా ఆయనకు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభీషణ్ (Padma Vibhushan Award ) ఇచ్చి గౌరవిస్తోంది ప్రభుత్వం. ఇది తెలుగు తనానికి.. తెలుగు జాతికి దక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చు. తెలుగు జాతి గౌరవించే నాయకుడు.. విద్యార్థి రాజకీయాల నుంచి పద్మ విభూషణ్ వరకూ ఎదిగిన వెంకయ్య నాయుడు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే నుంచి దేశ ఉప రాష్ట్రపతి (Vice President) వరకూ ఆయన చూడని పదవి లేదు. ఏ పదవిలో ఉన్నా.. తాను నమ్మిన సిద్ధాంతాన్ని వదల్లేదు. ఎంతటి కష్టంలోనైనా తాను ఉన్న పార్టీని వీడలేదు. ఆ విశ్వసనీయతే ఆయనకు శ్రీరామరక్ష అయింది. పద్మ విభీషణ్ పురస్కారాన్ని అందుకోబోతున్న వేళలో వెంకయ్య నాయుడి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
బాల్యం..
వెంకయ్యనాయుడు 1949 జూలై 1న ఆంధ్ర ప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో రంగయ్యనాయుడు-రమణమ్మ దంపతులకు జన్మించారు. తన ప్రాథమిక విద్య తర్వాత, వెంకయ్య నెల్లూరులోని వీఆర్ కళాశాలలో రాజనీతి శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖలో న్యాయశాస్త్రం పూర్తి చేసి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వెంకయ్యనాయుడు విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. చిన్నప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవక్‌గా పనిచేశారు. దీంతో క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన జీవితానికి అలవాటు పడ్డారు.
విద్యార్థి రాజకీయాలు..
కాలేజీ విద్యార్థిగా ఏబీవీపీలో (ABVP) చేరి చురుగ్గా పనిచేశారు. వీఆర్ కాలేజీ, ఆంధ్రా యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1972 జై ఆంధ్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. విజయవాడ, నెల్లూరు నగరాల్లో ఉద్యమాలు చేసి తన వాగ్ధాటితో ఖ్యాతి గడించారు. ఆంధ్రా లా కాలేజీ తరపున ఏబీవీపీ అధ్యక్షుడిగా ఎన్నికవడం వెంకయ్య జీవితంలో ఓ మలుపు అని చెప్పొచ్చు. 1972లో వెంకయ్య జై ఆంధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. కాకాని వెంకట రత్నం పంతులు వంటి ప్రముఖులతో కలిసి పనిచేశారు. 1977లో ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. జైలుకు కూడా వెళ్లారు.
ఎమ్మెల్యేగా..
1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉదయగిరి నుంచి పోటీ చేసి అసెంబ్లీ సభ్యునిగా వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) తొలిసారిగా ఎన్నికయ్యారు. అప్పట్లో దేశమంతా ఇందిరాగాంధీ పేరు మారుమోగుతున్నా.. ఉదయగిరిలో మాత్రం వెంకయ్య నాయుడినే విజయం వరించింది. స్వయంగా ఇందిరాగాంధీ అక్కడ ప్రచారం చేసినా ఆయనను ఓడించలేకపోయారు. అలా తొలిసారి ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1980 నుంచి 1983 వరకు బీజేపీ (BJP) అఖిల భారత యువజన సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
ఆ తర్వాత 1983 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసినా ఉదయగిరిలో వెంకయ్యనాయుడు విజయం సాధించారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంకయ్య ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి పెద్ద పీట వేశారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు.
జాతీయ రాజకీయాల్లో..
వెంకయ్య నాయిడికి జాతీయస్థాయిలో పార్టీలో పలు కీలక పదవులు వెతుక్కుంటూ వచ్చాయి. 1996 నుంచి 2000 వరకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 1998లో కర్ణాటక (Karnataka) నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అనేక పార్లమెంటరీ బోర్డులకు సభ్యుడిగా, చైర్మన్‌గా పనిచేశారు.
Also Read: బంగారం కొనేవారికి మంచి అవకాశం.. నిలకడగా ధరలు
సెప్టెంబరు 2000 నుంచి జూన్ 2002 వరకు వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. జులై 2002లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై, 2004 చివరి వరకు పనిచేశారు. ఆ తర్వాత 2004, 2010లో రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ మరింత వేళ్లూనుకోవడానికి కృషి చేశారు. ఇంగ్లిష్, హిందీ భాషలపై వెంకయ్య నాయుడుకు ఉన్న పట్టు రాజకీయాల్లో ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు సహకరించింది. 2014లో మోడీ కేబినెట్‌లో (Modi Cabinet) సమాచార, ప్రసార శాఖతో పాటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.
సామాజిక సేవలో..
రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు వెంకయ్య(Venkaiah Naidu). ఆయన స్థాపించిన స్వర్ణ భారతి ట్రస్ట్ (Swarna Bharath Trust) తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పేదలు - అనాథల కోసం ఈ ట్రస్ట్ ఒక పాఠశాలను నిర్వహిస్తోంది. అదేవిధంగా ఇక్కడ పిల్లలకు, నిర్వహిస్తారు. వెంకయ్యకు భార్య ఉషతో పాటు కుమారుడు హర్ష, కుమార్తె దీప ఉన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ వ్యవహారాలను దీప చూసుకుంటున్నారు.
Watch this interesting Video: