Former Minister Narayana: నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ కొరివారికండ్రిగ, వడ్డిపాలెం ప్రాంతాల్లో పర్యటించారు మాజీ మంత్రి, డాక్టర్ పొంగూరు నారాయణ. స్థానిక టీడీపీ శ్రేణులు, ప్రజలు అడుగడుగునా ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిరువ్యాపారులు చేసుకునే మహిళలకు తోపుడుచెక్కబండ్లను అందజేసి నారాయణ దాతృత్వం చాటుకున్నారు. అనంతరం ఆయా ప్రాంతాల్లోని ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. తదనంతరం ఇంటికి వెళ్లి బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ కరపత్రాలను ప్రజలకు అందజేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు రావాలని, ఇందుకు అందరు మద్దతు తెలియజేయాలని ప్రజలను కోరారు.
శాశ్వత పరిష్కారం..
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. ఈ ప్రాంతం ఎండోమెంట్‌లో ఉండడం వల్ల పలుమార్లు స్థానికంగా ఉండేవారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే స్థానికుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రపంచంలో ఏపీ రాజధాని టాప్ లో ఉండేలా చేయాలని టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. ఆ మేరకు ప్రపంచంలో బాగా డిజైన్ చేసే లండన్‌లోని నార్మన్ ఫార్టర్ అండ్ పార్టరస్ వారి చేత ప్రణాళికలు చేయించామని తెలిపారు. ఈ క్రమంలో అమరావతిలోని రాజధాని ప్రాంతంలో 9 వేల కోట్ల రూపాయల ఖర్చుతో రోడ్లు, అండర్‌గ్రౌండ్‌సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, తదితర పనులు కూడా చేయడం జరిగిందన్నారు. ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం సచివాలయభవనాలు సౌకర్యవంతంగా తీర్చిదిద్ది పనులు కూడా చేపట్టడం జరిగిందని తెలిపారు.
Also Read: సమస్యను పరిష్కరించకపోతే నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేస్తా: కొలికపూడి శ్రీనివాసరావు
రాష్ట్రంలోని ఏ జిల్లా నుంచి అయిన సచివాలయానికి వస్తే ఇబ్బంది పడకుండా అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల కోసం ఒకే భవనంలో ఉండేలా ప్రణాళికతో డిజైన్ చేసి రూపకల్పన చేశామని చెప్పారు. కానీ నేడు వైసీపీ పాలనలో పరిపాలన విధానం తెలియక, అంత గొప్ప రాజధాని ప్రాంతాన్ని ముళ్లకంపచెట్లు నిండిపోయేలా గాలికొదిలేయడం దౌర్భాగ్యమన్నారు. లండన్ స్థాయిలో అమరావతి రాజధానిని డెవలప్ చేయాలని చూశామని చెప్పారు. ఏ దేశం నుంచి అయినా అతిథులు వస్తే అమరావతి రాజధానిని తప్పకుండా చూసేలా డిజైన్ చేయడం జరిగిందన్నారు.
జగన్ సైకో
రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే రాజధాని నిర్మాణానికి జగన్‌మోహన్‌రెడ్డి అరాచకపాలనతో నాశనం చేశారని మండిపడ్డారు. త్వరలో రానున్న చంద్రబాబు పాలనలో తిరిగి రాజధాని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. జగన్ సైకో అంటూ ఎద్దేవా చేశారు. ఆయన వైఖరి కక్షసాధింపే అని చెప్పారు. ఇటీవల నారాయణ సంస్థలపై అక్రమంగా సోదాలు చేసి భయానక వాతావరణం సృష్టించారని తెలిపారు. ఏదైనా ఉంటే డ్రగ్స్ ఫార్మసీ అధికారులు మాత్రమే వచ్చి తనిఖీలు చేయాలని గాని, అలా కాకుండా దాదాపు 200 మంది పోలీసులను తీసుకొచ్చి అరాచకం సృష్టించడం ఏమిటని ప్రశ్నించారు. అంత గందరగోళం చేసిన అధికారులు చివరాఖరకు ఏమీ లేదని క్లీన్‌షీట్ ఇచ్చారన్నారు. అక్రమాలు, దోపిడీలు చేయడం తమకు చేతకాదని చురకలంటించారు. అన్ని గమనిస్తున్న ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.