Missing Scissors : సాధారణంగా విమానాలు రద్దు అయిన ఆలస్యమైన దానికి వాతావరణం అనుకూలించకనో.. ఏవైనా సాంకేతిక సమస్యల వలనో జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఓ కత్తెర వల్ల ఏకంగా 36 విమానాలు ఆగిపోగా.. ఏకంగా 200 సర్వీసులు ఆలస్యమయ్యాయి. ఇది ఎక్కడ జరిగిందంటే జపాన్ లోని అత్యంత రద్దీగా ఉండే న్యూ చిటోస్ ఎయిర్ పోర్ట్ లో కొద్ది రోజుల క్రితం విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది.
దానికి కారణం ఓ కత్తెర (Scissor) అని తెలుసుకుని ప్రయాణికులు అవాక్కయ్యారు. అసలేం జరిగిందంటే.. న్యూ చిటోస్ ఎయిర్ పోర్టు (New Chitose Airport) లో గత శనివారం ఓ రిటైల్ స్టోర్ నుంచి కత్తెర కనిపించకుండా పోయింది. దీంతో ఈ విషయాన్ని విమానాశ్రయాధికారులు దృష్టికి వెళ్లింది.
వారు ఆ కత్తెర కోసం ఏకంగా రెండు గంటల పాటు వెతికారు. దీని కారణంగా 36 విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. మరో 201 విమాన సర్వీసులు (Flight Services) ఆలస్యమయ్యాయి. దీని గురించి ఎయిర్ పోర్టు అధికారులు స్పందిస్తూ.. భద్రతపరమైన చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఎవరైనా ఉగ్రవాది ఆ కత్తెర ను దొంగిలించి దాన్ని ఆయుధంగా చేసుకునే అవకాశం ఉందని..అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు.
కానీ ఇంతకీ ఆ కత్తెర ఆ స్టోర్ లోనే దొరికింది. స్టోర్ సిబ్బంది సరిగా చూడకపోవడంతో ఈ పొరపాటు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఏది ఏమైనా ఈ సంఘటన వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు అయితే తిరిగి వెళ్లిపోయారు కూడా.
Also Read : ‘మా నాన్నను జైల్లో వేయండి’.. ఓ ఐదేళ్ల బుడ్డోడి ఫిర్యాదు..!