DK Aruna Vs Vamshi Chand Reddy: తెలంగాణలో రాజకీయ వేడి రగులుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఎదురెదురు పడ్డారు. రెండు పార్టీల కార్యకర్తల నడుమ తోపులాట జరిగింది. పరస్పర దాడులు చేసుకున్నారు. పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
నేతల మధ్య యుద్ధమే..
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయాలు భగ్గుమన్నాయి. బీజేపీ నేత డీకే అరుణ, కాంగ్రెస్ నేత వంశీ చంద్ రెడ్డి నడుమ గత కొన్ని నెలలుగా మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కాగా వీరి నడుమ తలెత్తిన గొడవ ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శాంతి భద్రతలకు ముప్పు చేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణలకు దారి తీస్తోంది. ఇదిలా ఉంటే మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి వంశీ చంద్ రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో వాళ్ళ పార్టీల జెండా ఎగురవేసేందుకు ఎన్నికల ప్రచారంలో ఘాటు వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణలో ఎన్నికల హీట్ ను పెంచుతున్నారు.