Delhi Liquor Scam: ఎట్టకేలకు కవితకు బెయిల్.. అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటో తెలుసా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. దీంతో మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై చర్చ నడుస్తోంది. ఇంతకీ అసలేంటీ ఢిల్లీ లిక్కర్ స్కామ్? ఇందులో కవిత పాత్ర ఉందా? ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు? తదితర పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 27 Aug 2024 in తెలంగాణ ట్రెండింగ్ New Update షేర్ చేయండి BRS MLC Kavitha: మార్చి 15న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు 166 రోజుల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని తెలిపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు పూర్తి చేసిందని వెల్లడించింది. దీంతో ఇక నిందితులు జైలులో ఉండాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మహిళ అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ ఇస్తున్నట్లు వివరించింది. అయితే.. కవిత బెయిల్ తో మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం మరో సారి చర్చనీయాంశమైంది. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి? అందులో కవిత పాత్ర ఉందా? ఈడీ ఏం చెబుతోంది? అన్న వివరాలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీ మద్యం పాలసీ ఏమిటి? నవంబర్ 17, 2021న ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని (Liquor Policy Scheme) అమలు చేసింది. ఈ పాలసీ కింద ఢిల్లీలో 32 జోన్లు ఏర్పాటు చేసి ఒక్కో జోన్‌లో గరిష్టంగా 27 దుకాణాలు తెరవాలి. ఈ విధంగా మొత్తం 849 దుకాణాలు తెరవాల్సి ఉంది. ఈ పాలసీ అమలకు ఢిల్లీలోని అన్ని మద్యం దుకాణాలను ప్రైవేటు పరం చేశారు. గతంలో ఢిల్లీలో 60 శాతం మద్యం దుకాణాలు ప్రభుత్వ, 40 శాతం ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండేవి. ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అది నూటికి నూరు శాతం ప్రైవేటుగా మారింది. దీనివల్ల రూ.3,500 కోట్ల లాభం చేకూరుతుందని ప్రభుత్వం అప్పట్లో చెప్పుకొచ్చింది. సిసోడియా(File) ఫీజులు పెంపు: ఈ పాలసీ అమలు సమయంలో లైసెన్స్ ఫీజులను కూడా ప్రభుత్వం భారీగా పెంచింది. కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎల్-1 లైసెన్స్ కోసం కాంట్రాక్టర్లు రూ.5 కోట్లు చెల్లించాల్సి ఉండగా, గతంలో రూ.25 లక్షలు కాంట్రాక్టర్లు చెల్లించాల్సి వచ్చేది. అదేవిధంగా ఇతర కేటగిరీల్లో లైసెన్స్ ఫీజులు కూడా గణనీయంగా పెంచింది ఆప్ సర్కార్. బడా మద్యం వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే లైసెన్స్ ఫీజును పెంచిందన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే ఢిల్లీలో చిన్న కాంట్రాక్టర్ల దుకాణాలు మూతపడ్డాయి. బడా మద్యం కంట్రాక్టర్లకు మాత్రమే మార్కెట్లో లైసెన్సులు లభించాయి. అంతేకాదు మద్యం మాఫియా ఈ పాలసీలో వేలు పెట్టిందని.. ఆప్ నాయకులు, అధికారులకు భారీ మొత్తంలో లంచం ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.అయితే లైసెన్స్ ఫీజు పెంచడం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరిందని కేజ్రీవాల్ ప్రభుత్వం వాదించింది. అందుకే ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం, వ్యాట్ తగ్గించినట్టు చెప్పుకొచ్చింది. కొత్త మద్యం పాలసీలో అదే 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ ధరను రూ.530 నుంచి రూ.560కి పెంచారు. దీంతోపాటు రిటైల్ ట్రేడర్ లాభం కూడా రూ.33.35 నుంచి రూ.363.27కు పెరిగింది. అంటే రిటైల్ వ్యాపారుల లాభం 10 రెట్లు పెరిగింది. దర్యాప్తు ఎలా ప్రారంభమైంది? ఈ మద్యం పాలసీ అమలులో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు (CBI Enquiry) సిఫారసు చేశారు. కొత్త మద్యం పాలసీలో నిబంధనల ఉల్లంఘన, విధానపరమైన అవకతవకలకు సంబంధించి 15 మంది నిందితులపై 2022 ఆగస్టులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత సీబీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి పీఎంఎల్ఏ కింద మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వ నూతన మద్యం పాలసీలో జరిగిన కుంభకోణంపై ఈడీ, సీబీఐ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ విధానం రూపకల్పన, అమలులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. విధాన రూపకల్పనలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. BRS leader Kavitha arrested by ED in Delhi liquor policy money laundering case at 5:20 PM. pic.twitter.com/7KlFrlej7I — Arvind Gunasekar (@arvindgunasekar) March 15, 2024 అరెస్టుల పర్వం: ఈ కేసులో ఎక్కువగా అరెస్టైన వారంతా ఆమ్ ఆద్మి పార్టీ (Aam Aadmi Party) ప్రముఖులే. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో సిసోడియాతో పాటు విజయ్ నాయర్, అమిత్ అరోరా, దినేష్ అరోరా, సంజయ్ సింగ్, సమీర్ మహేంద్రూ, అరుణ్ రామచంద్రన్, రాజేష్ జోషి, గోరంట్ల బుచ్చిబాబు, అమిత్ అరోరా, బెనాయ్ బాబు (ఫ్రెంచ్ లిక్కర్ కంపెనీ పెర్నోడ్ రికార్డ్ జనరల్ మేనేజర్), అరబిందో ఫార్మా హోల్ టైమ్ డైరెక్టర్, ప్రమోటర్ పి శరత్ చంద్రారెడ్డి, వ్యాపారవేత్త అమన్ దీప్ ధాల్, వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్ పల్లి ఉన్నారు. ఈ కేసులో దాదాపు 80 మందికిపైగా విచారణ చేయగా.. వీరిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఉన్నారు. అరుణ్ రామచంద్రన్ పిళ్లై (file) కవిత పాత్ర ఏంటి? తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె అయిన కవితకు అనేక వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉంది. అందులో 'సౌత్ గ్రూప్' (South Group) ఒకటి. ఈ గ్రూప్‌ని కంట్రోల్ చేసే వారిలో వారిలో కవిత ఒకరు. ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీ రూపకల్పనలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులకు అనుకూలంగా వ్యవహరించినందుకు ఆప్ ప్రతినిధి విజయ్ నాయర్‌కు కవితకు చెందిన సౌత్ గ్రూప్ రూ.100 కోట్లు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. #WATCH | Delhi: BRS MLC K Kavitha leaves from the residence of her father, Telangana CM K Chandrashekar Rao, for the ED office ED yesterday questioned her for over 10 hours in connection with her alleged role in the Delhi liquor policy case. pic.twitter.com/qtY1r0jAfw — ANI (@ANI) March 21, 2023 కవిత చుట్టూ ఉచ్చు ఎలా బిగుసుకుంది? హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్రన్ పిళ్లైని (Ramachandran Pillai) గతేడాది(2023) మార్చిలో ఈడీ అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూప్‌లో పిళ్లై కీలక సభ్యుడు. కవితకు కీలక సూత్రధారిగా, గ్రూప్ ఫ్రంట్ మ్యాన్‌గా పిళ్లై కవిత సూచనల మేరకే వ్యవహరించారని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ మాగుంట, అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డిలతో కూడిన 'సౌత్ గ్రూప్' ఈ లిక్కర్ స్కామ్‌లో అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. కవిత ప్రయోజనాలకు పిళ్లై ప్రాతినిధ్యం వహించారని ఈడీ పేర్కొనగా. పిళ్లై ఈ విషయాన్ని తమ వాంగ్మూలంలో చెప్పారు. ఇక ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో పిళ్లై ప్రమేయం ఉందని, విజయ్ నాయర్ కు ఇన్ పుట్స్ ఇచ్చారని చెబుతోంది. అనేక సార్లు విచారణకు హాజరుకాని కవిత.. దర్యాప్తు సంస్థ అనేకసార్లు సమన్లు జారీ చేసినా ఈడీ ముందు కవిత హాజరుకాకుండా ఉండేవారు. దర్యాప్తు సంస్థల కార్యాలయాలకు మహిళలను పిలవకుండా సీఆర్పీసీ ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చినప్పటికీ తనను తమ ముందు హాజరుకావాలని ఈడీ కోరుతోందని పేర్కొంటూ ఆమె గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలు తనను ప్రశ్నించే ప్రదేశాన్ని ఎంచుకునే అవకాశాన్ని తనకు ఇవ్వాలని ఆమె వాదించారు. కవిత పిటిషన్‌పై మొదటి విచారణ 2023 మార్చిలో జరిగింది. తన పిటిషన్ పరిష్కారం అయ్యే వరకు తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీని ఆదేశించాలని ఆమె కోర్టును అభ్యర్థిస్తూ వచ్చారు. ఫిబ్రవరి 26న ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరుకావాలని సీబీఐ ఇటీవల కవితను కోరింది. అయితే సీఆర్పీసీ సెక్షన్ 41-ఏ కింద జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని ఆమె దర్యాప్తు సంస్థను కోరారు. నోటీసును రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని అడిగారు. డిసెంబర్ 2022లో తన నివాసంలో సీఆర్పీసీ సెక్షన్ 160 కింద తనను విచారించారని ఆమె గుర్తు చేశారు. తన పిటిషన్ కోర్టులో పెండింగ్ ఉందని కవిత చెప్పుకొచ్చారు. అయితే దర్యాప్తు సంస్థకు తన నుంచి ఏదైనా సమాచారం అవసరమైతే వర్చువల్‌గా హాజరయ్యేందుకు రెడీగా ఉంటానని కవిత చెప్పేవారు. ఇదంతా జరుగుతున్న సమయంలో ఈడీ, ఐటీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు చేశారు. మార్చి 15న ఆమెను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నాటి వారకు ఆమె జైలులో ఉన్నారు. #mlc-kavitha #supreme-court #delhi-liquor-scam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి