తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలంటే అందరూ ప్రధానంగా చర్చించుకునేది కులాల గురించే. ఏ కులం ఓట్లు ఏ పార్టీకి పడే ఛాన్స్ ఉంది? ఈసారి ఏ కులం వారు ఏ పార్టీ పక్షాన నిలపడుతున్నారు? ఓబీసీ(OBC)లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు ఎలాంటి ప్లాన్ వేశాయి? ఎస్సీ, ఎస్టీ ఓట్లను తమవైపునకు పార్టీలు ఎలా తిప్పుకుంటున్నాయి? అగ్రకులాల మద్దతు కోసం పార్టీలు ఎలాంటి స్ట్రాటజీలు వేస్తున్నాయి లాంటి ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. విశ్లేషకులే కాదు.. సామాన్య ప్రజలూ ఎన్నికలప్పుడు కులాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. అటు రాజకీయ నాయకులూ ఇదే అస్త్రంతో ఎన్నికల ప్రచారంలోకి దూకుతుంటారు. తాజాగా కాంగ్రెస్ అదే చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్న హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కులగణన అస్త్రాన్ని బయటకు తీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని హామీ ఇచ్చారు.
రాహుల్ హామీ తెలంగాణ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారుతాందా?
కాంగ్రెస్ విజయ భేరి యాత్రలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ(telangana) రాజకీయ వర్గాల్లో కాకరేపుతున్నాయి. అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే కులగణన చేపట్టామని.. తెలంగాణలో కూడా అధికారంలోకి రాగానే కులగణన చేస్తామంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. అటు నిన్నమొన్నటివరకు కులగణన చేయాలంటూ మాట్లాడిన బీఆర్‌ఎస్(BRS) ప్రస్తుతం ఈ విషయంపై మౌనం వహిస్తుందన్న వాదన కాంగ్రెస్ వైపు నుంచి వినిపిస్తోంది. గతంలో అనేకసార్లు కులగణన కోసం కేసీఆర్ గొంతు విప్పారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుత ఎన్నికల ప్రచారాల్లో ఎక్కడా కూడా బీఆర్‌ఎస్ ఈ అంశాన్ని లేవనెత్తడంలేదని కాంగ్రెస్ అంటోంది. కేంద్రంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ కులగణన విషయంలో ఒక్కటే వైఖరితో ఉన్నారని చెబుతోంది. మరోవైపు విశ్లేషకులు సైతం కులగణన అంశాన్ని తక్కువ అంచనా వేయకూడదని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఈ అంశం గేమ్ ఛేంజర్‌గా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొడుతున్నారు.
2021లో ఏం జరిగిందంటే?
నిజానికి 2021లోనే కేసీఆర్ సర్కార్ కులగణన కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. 2021, అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ సెషన్‌లో దీనికి సంబంధించిన తీర్మానాన్ని పాస్ చేశారు. సాధారణ జనాభా గణనను నిర్వహించేటప్పుడు కులగణన కూడా చేయాలని నాడు బీఆర్‌ఎస్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. కులాల వారీ జనాభా గణనను కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. బీసీ జనాభా డేటాను సేకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తెలంగాణ జనాభాలో దాదాపు 50 శాతం బీసీలు ఉన్నారని కేసీఆర్ అప్పుడు అసెంబ్లీలో చెప్పారు. దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు, రాష్ట్ర అసెంబ్లీలు కుల గణన కోరుతూ తీర్మానాలు చేయాలని సూచించారు కూడా. జనాభా గణనలో భాగంగా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి ఈ లెక్కల ప్రకారం రిజర్వేషన్లు పెంచేందుకు కులగణన అవసరమని కేసీఆర్ స్వయంగా చెప్పడం.. ఇప్పుడు మాత్రం ఈ అంశంపై ఏం మాట్లడకపోవడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.
బీహార్ చేసింది కదా:
కులగణన చేపట్టాలని కేంద్రంపై గతంలో అనేకసార్లు కోరిన బీఆర్‌ఎస్.. తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఆ వైపుగా ఎందుకు అడుగులు వేయలేదన్నదానిపై స్పష్టమైన సమాధానం కోరుతోంది కాంగ్రెస్. అటు బీహార్ ఇప్పటికే కులగణనను పూర్తి చేసింది. ఏ కులం వారు ఎంత శాతం ఉన్నారన్న డేటాను ఇటివలే రిలీజ్ చేసింది కూడా. సుప్రీంకోర్టులోనూ దీనిపై గట్టిగా వాదించిన బీహార్ చెప్పిన పని చేసింది. బీహార్‌నే ఎగ్జాంపుల్‌గా తీసుకోని కులగణన చేయాలంటున్నారు రాహుల్. ఎందుకుంటే బీహార్ నితీశ్ ప్రభుత్వం ప్రస్తుతం 'INDIA' కూటమికి మద్దతుగా ఉంది. అందుకే బీహార్‌ని ఉదాహరణగా తీసుకోమని చెప్పడానికి రాహుల్ ఏ మాత్రం ఆలోచించడంలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జనాభా ఎక్కువున్న ఓబీసీలను తమవైపునకు తిప్పుకునేందుకు రాహుల్ వేసిన మాస్ట్రర్ ప్లాన్‌గా అభివర్ణిస్తున్నారు. అయితే ఇది వర్క్ అవుతుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
కులగణన ఎప్పుడు జరిగింది?
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రతి 10ఏళ్లకు ఒకసారి జనగణన జరగింది కానీ కులగణన ఎన్నడూ జరగింది లేదు. స్వాతంత్రానికి 16ఏళ్ల ముందు దేశాన్ని బ్రిటీష్ పాలిస్తున్న సమయంలో కులగణన జరిగింది. 1931లో చివరిసారిగా కులాలగణన జరిగింది. 1881 సంవత్సరంలో మొదటిసారిగా కులాల ఆధారంగా నివేదికను విడుదల చేశారు. ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డేటాను రిలీజ్ చేశారు. 1941లో కూడా కుల గణన నిర్వహించచారు కానీ దాని డేటాను విడుదల చేయలేదు. కుల గణనలో, షెడ్యూల్డ్ కులాలు(SC), తెగల(ST) జనాభా గణన 1941 నుంచి నిర్వహిస్తున్నారు కానీ ఇతర కులాల ప్రత్యేక జనాభా గణనను నిర్వహించలేదు. ఇక మండల్ కమిషన్ టైమ్‌లో బీసీ కులాల జనాభా 54శాతంగా తేల్చి ఓబీసీకు 27శాతం రిజర్వేషన్లను ఫిక్స్ చేసి అమలు చేస్తున్నారు.
తెలంగాణలో బీసీ గణన చేస్తే ఏం అవుతుంది?
తెలంగాణ ప్రభుత్వం 2014లో సమగ్ర కుటుంబ సర్వే (SKS) నిర్వహించగా, రాష్ట్రంలో బీసీలు 51శాతంతో అత్యధికంగా ఉన్నారని తేలింది. రైతు బంధు, పెన్షన్ పెంపు లాంటి వివిధ పథకాల రూపకల్పనకు ఈ డేటానే ఉపయోగించింది ప్రభుత్వం. సొంతంగా సర్వే చేసుకునే అవకాశం ఉన్నా బీఆర్‌ఎస్ ప్రభుత్వం కులగణన కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుండడాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. స్వాతంత్రానికి ముందు లేదా రాష్ట్ర విభజనకు ముందు డేటాతో న్యాయం జరగదని అటు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందని.. అప్పుడు బీసీల మద్దతు తమవైపు ఉంటుందని హస్తం నేతలు ఆలోచిస్తున్నట్టుగా చెబుతున్నారు. అటు బీజేపీ కూడా ఈ అంశంలో నోరెత్తడం లేదు. ప్రధాని మోదీ స్వయంగా బీసీ, పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా బీసీనే కావడం.. అయినా కూడా బీసీ గణన ఊసెత్తకపోవడంతో కమలం పార్టీకి ఈ అస్త్రంతో కాంగ్రెస్ చెక్ పెట్టేలా ప్రణాళిక రచించందన్న టాక్ వినిపిస్తోంది. అంటే ఒక దెబ్బకు రెండు పిట్టాలు అన్నమాట. అయితే ఈ కులగణన అంశం రానున్న తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపుతుందా.. లేదా అన్నది తెలియాలంటే డిసెంబర్ 3 ఫలితాలు వచ్చేవరకు వేచి చూడాల్సిందే..!
Also Read: వంద సీట్లు గెలుస్తాం..కాంగ్రెస్ ను రనౌట్, బీజేపీని డకౌట్ చేస్తాం: హరీశ్ రావు సంచలన ఇంటర్వ్యూ