Rapolu Ananda Bhaskar: బీఆర్ఎస్ పార్టీ చుట్టూ నేతల రాజీనామాల గండం చుట్టుకుంది. లోక్ సభ ఎన్నికలకు మరికొన్ని రోజుల సమయం ఉండగా బీఆర్ఎస్ పార్టీకి పద్మశాలి సంఘం నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు పంపారు. గతంలో తనను పార్టీలో చేర్చుకుంటూ కేసీఆర్ కప్పిన గులాబీ కండువాను మడతపెట్టి తిరిగి హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు పోస్ట్ ద్వారా పంపనున్నట్లు తెలిపారు.
వ్యక్తి గత కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేయవలసి వచ్చిందని అన్నారు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. విధిలేని పరిస్థితిలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఏ పార్టీలోకి వెళ్తానో చెప్పలేను.. ప్రజా ఉద్యమాల్లో ఉంటా అని అన్నారు.
మరోవైపు మెదక్ జిల్లా సీనియర్ నేత మహమ్మద్ మొహినుద్దీన్, వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ నేత, రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడు తీగల లక్ష్మణ్ గౌడ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. లోక్ సభ ఎన్నికల వేళ నేతల రాజీనామాలతో బీఆర్ఎస్ పార్టీ మెల్లగా ఖాళీ అవుతోంది. ఎన్నికల్లో గెలుపు సంగతి దేవుడు ఎరుగు కానీ సొంత పార్టీ నేతలను కాపాడుకోవడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి.