Sahiti Infra : సాహితీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్(Sahithi Group) కు చెందిన రూ.150 కోట్ల విలువైన ఆస్తులను ఈడీఅటాచ్ చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది ఆ సంస్థ. అమీన్‌పూర్‌లో బిల్డింగ్ పేరుతో రూ. 89 కోట్లు వసూలు చేయడంతో పాటు మరో రూ.126 కోట్లను వ్యక్తిగతంగా వాడుకున్నట్లు ఈడీ గుర్తించింది. సంస్థ ఎండీ లక్ష్మీనారాయణ, పూర్ణచంద్రరావుకు చెందిన చర, స్థిర ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇప్పటికే ఈ మేరకు కేసు నమోదు చేసింది.
సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా లిమిటెడ్, దాని ఎండీ బి. లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ బి. పూర్ణచంద్రరావు, వారి కుటుంబ సభ్యులతో పాటు అనుబంధ సంస్థలు, ఓమిక్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు సంబంధించిన చర, స్థిర ఆస్తులను మనీ లాండరింగ్ నిరోధక చట్టం, 2002 కింద ఎస్ఐవీఐపీఎల్ ఫ్రాడ్ కేసులో ఈడీ అటాచ్ చేసింది.
ఐపీసీ సెక్షన్ 420 కింద సంస్థతో పాటు దాని డైరెక్టర్లు, మరికొంత మందిపై పలువురు కొనుగోలుదారుల ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ పోలీసులు నమోదు చేసిన వివిధ ఎఫ్ఐఆర్ ల ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించింది. సాహితీ ఇన్ఫ్రాటెక్, గ్రూపునకు చెందిన ఇతర సంస్థలు ఫ్లాట్‌లు అందజేస్తామని హామీ ఇచ్చి మొత్తం 655 మంది కొనుగోలుదారులను మొత్తం రూ. 248.27 కోట్ల మేరకు మోసగించాయి.
అమీన్‌పూర్ గ్రామంలో తన ‘శర్వాణి ఎలైట్’ ప్రాజెక్ట్‌తో పాటు ఇతర ప్రాజెక్ట్‌ల కోసం వినియోగదారుల నుంచి సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 250 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. సంస్థ అమీన్‌పూర్ గ్రామంలో మొత్తం రూ. 89 కోట్లతో భూమిని కొనుగోలు చేసినప్పటికీ, ప్రాజెక్టు ప్రారంభించి మూడేళ్లు గడుస్తున్నా అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు.
అంతేకాకుండా సాహితీ సంస్థ ఓమిక్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థకు తన నిర్వహణలో ఉన్న అమీన్ పూర్ లోని 9 ఎకరాల భూమి అభివృద్ధి కోసం 2020 జూన్ 12నాటి ఓ ఒప్పందం ద్వారా రూ. 32.15కోట్లు చెల్లించినట్లు కూడా ఈడీ విచారణ వెల్లడించింది. అయితే, ఓమిక్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూ. 3కోట్ల విలువ చేసే రెండెకరాలను మాత్రమే సాహితీ సంస్థకు బదిలీ చేసి, చెల్లించాల్సిన మిగతా రూ. 29.15కోట్లను తన వద్దే ఉంచుకుంది.
సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్, అప్పటి సేల్స్, మార్కెటింగ్ టీం హెడ్ సందు పూర్ణచంద్రరావు కస్టమర్ల నుంచి వసూలు చేసిన రూ. 126కోట్లను దుర్వినియోగం చేశారని కూడా ఈడీ విచారణ బయటపెట్టింది. ఇది 2018 - 2020 ఆగష్టు మధ్య కస్టమర్ల నుంచి నగదు రూపంలో సేకరించిన రూ. 50 కోట్లు ఉన్నాయి. ఎస్. పూర్ణచంద్రరావు తన పేరు మీద లేదా కుటుంబ సభ్యులు లేదా సంస్థల పేరిట కోట్లాది రూపాయల విలువైన స్థిరాస్తులను కలిగి ఉన్నట్లు తదుపరి విచారణలో తేలింది. అవి ప్రధానంగా సాహితీ ఇన్ఫ్రాటెక్ సంస్థ నుంచి తప్పుకున్న తర్వాత న్యాయవిరుద్ధమైన మార్గంలో వచ్చిన ఆదాయాన్ని లాండరింగ్ చేయడం సంపాదించినవని తేలింది. తదుపరి విచారణ పురోగతిలో ఉంది.