EC Declares Holiday: గురువారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని అన్ని సంస్థలు, కంపెనీలు తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదేశించింది. ఉద్యోగులు ఓటింగ్ లో పాల్గొంనేందుకు నవంబర్ 30న (November 30) సెలవుదినంగా ప్రకటించాలని సూచించింది. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సీఈవో వికాస్ రాజ్ విడుదల చేశారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల టైంలో కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లుగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ మేరకు ఈ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో ..లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు వికాస్ రాజ్ (Vikas Raj) ఆదేశాలు జారీ చేశారు.
కాగా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సైతం బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించనున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు.
Also read: ముగిసిన తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం.. ఇప్పటివరకు సర్వేల లెక్కలివే!
ఇదిలా ఉండగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచార పర్వం కూడా ముగిసింది. చివరి రోజు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ ప్రచారాన్ని హోరెత్తించారు. రోడ్ షో లతో హడావుడి చేశారు. మరొక్క రోజు గడిస్తే.. ఏ పార్టీ భవితవ్యం ఏంటనేది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంటుంది. డిసెంబర్ 3న ఇక తెలంగాణను ఏలేది ఏ పార్టీ అనేది తేలిపోతుంది. ఓటర్లు ఎవరిని దీవిస్తారు? ఎవరికి పట్టం కడతారు? అనే అంశంపై ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాజకీయ నేతలు. కాగా, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఏ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు? తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో చూడాలి మరి.!