Healthy Eating:మంచి ఆహారం ఆరోగ్యానికి పరమౌషధం

మన శరీరం ఒక యంత్రం లాంటిది. ఇంధనం లేకపోతే యంత్రం ఎలా పని చేయలేదో అలా మన శరీరం కూడ ఆహారం లేకపోతే పని చేయదు. మనం తీసుకొనే ఆహారం శరీరం సక్రమంగా పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తూ ‘ఇంధనం’ లా పని చేస్తుంది. అయితే ఆధునిక జీవ‌న శైలి కార‌ణంగా మ‌నం ఏ ఆహారం తీసుకుంటున్నామో నియంత్ర‌ణ లేకుండా పోయింది.

New Update
Healthy Eating:మంచి ఆహారం ఆరోగ్యానికి పరమౌషధం

తిండి లేని రోజు లేదు....అపోహ లేని ఆహారం ఉండదు. అన్నం, నీళ్ళు, పప్పు, కూర, పాలు, పెరుగు, చక్కెర, బెల్లం, మాంసం....ఏదైనా దాని చుట్టూ తేనె తుట్టలా మోలెడు అపోహలు వేళ్ళాడుతూ ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన తిండి తినాలి. అంటే అదేమిటో మనకు తెలియాలి. అపోహల నుంచి బయట పడాలి.

కొన్ని ఆహార పదార్థాలలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. కొన్నింటిలో తక్కువ పోషక విలువలు ఉంటాయి. అలాగని ఏ ఆహారాన్ని తీసి పారేయటానికి వీలులేదు. మనం ఎంత తింటు న్నామన్నది మాత్రమే కాదు. ఏమి తింటున్నామన్నది కూడా ముఖ్యమైన అంశమే.కొన్ని కొన్ని ఆహార పదార్థాలు కొన్ని కొన్ని వ్యాధుల్ని నిరోధించగలవు. నియంత్రించగలవు.

శరీరారోగ్యానికి అవసరమైన ఇలాంటి అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకుం టూ, ప్రాధాన్యతనిస్తూ, మనం సక్రమమైన ఆరోగ్యంలో ఉండటానికి ఏ ఏ ఆహార పదార్థాలను ఏఏ మేర తీసుకోవాలన్న విషయమై అమెరికా సైంటిస్టులు ‘ఫుడ్‌ గెైడ్‌ పిరమిడ్‌’ అన్న పేరుతో ఆహార నియమావళిని రూపొందించారు.

ఫుడ్‌ గెైడ్‌ పిరమిడ్‌:

దీని ప్రకారం అన్నం, రొట్టె, బ్రెడ్‌.... వీటిని ఎక్కువగా వాడుకోవాలి. ఈ ఆహార పదార్థాలలో ఫైబర్‌, ‘బి’ విటమిన్‌లు, ఖనిజలవణాలు పుష్కలంగా ఉండటమే కాకుండా కాంప్లెక్స్‌ కార్బొహైడ్రేట్స్‌ కూడా లభిస్తాయి.

పళ్ళు:వీటిలో కొవ్వు, ఉప్పు తక్కువగా ఉంటాయి. విటమిన్‌లు ‘ఎ’,‘సి’ లాంటివి అధికంగా లభిస్తాయి. పొటాషియం, మరికొన్ని ఖనిజ లవణాలు కూడా లభించటమే కాక ఫైబర్‌ అధికంగా లభిస్తుంది. వీలెైనప్పుడల్లా తాజా పళ్ళను తినటం మేలు.

కాయగూరలు: వీటిలో కూడా కొవ్వు తక్కువగానూ, ‘ఎ’, ‘సి’ విటమిన్‌లు ఎక్కువగానూ లభిస్తాయి. ఫెైబర్‌, ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. మాంసం, చేపలు, చికెన్‌, గుడ్లు, జీడిపప్పు, వగెైరాలు: వీటిలో సాధారణంగా ప్రొటీన్లు ఎక్కువ ఉంటాయి. ఐరన్‌, ‘బి’ విటమిన్‌, మరికొన్ని ఖనిజ లవణాలు కూడా బాగానే ఉంటాయి. కొవ్వు కూడా అధికంగానే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి.

పాలు,పెరుగు,వెన్న: డెైరీ ఉత్పత్తులలో కాల్షియం, ప్రొటీన్‌లు, విటమిన్‌లు, కొన్ని ఖనిజ లవణాలు ఎక్కువగా లభిస్తాయి. కొవ్వు కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి తక్కువగా వాడటం మంచిది.

స్వీట్లు,నూనెలు:ఈ ఆహారపదార్థాలలో పోషకవిలువలు అంతగా ఉండవు కాని కేలరీలు మాత్రం సమృద్ధిగా లభిస్తాయి. కేకులు, స్వీట్లులాంటి వాటిని ఎంత తక్కువగా తింటే అంత మంచిది.

మాంసం: మాంసంలో శరీరానికి అవసరమైన కొవ్వు, ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రొటీన్ ఎక్కువగా తింటే మంచిది అంటుంటారు. పప్పులు లాంటి వాటిల్లో కంటే మాంసంలో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

ఆహారం శరీరానికి సంబంధించింది... ఏమి తినాలో తెలుసుకోవాలంటే శరీరాన్ని అడగటమే ఉత్తమమైన మార్గం. ఒక మూస పద్ధతిలో మనల్ని ప్రవర్తింపచేసే ఆహారపు అలవాట్లని పెంచుకోవడం కంటే, మన వివేకాన్ని ఉపయోగించి స్పృహతో మన ఆహారం గురించి నిర్ణయించుకోవడం ఎప్పుడూ మంచిది.

ఆహారం-ఆరోగ్యం:
...................
మనం ఎలా తింటున్నామన్నది కూడా మనం ఏమి తింటున్నామన్నంత ముఖ్యమైన విషయమే. ఆరోగ్యకరమైన రీతిలో తినటానికి కింది నాలుగు సూత్రాలు పాటిస్తే చాలు.

ఎంత తినాలి?

కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మెదడు అత్యుత్తమంగా పనిచేస్తుందని పరిశోధనలు కనుగొన్నాయి. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఘ్రెలిన్‌ అనే హర్మోన్నుఉత్పత్తి చేస్తుందని, అది కడుపుకు ఆకలిగా ఉందన్న సంగతిని మెదడుకు చేరవేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ హార్మోన్ ఇతర వ్యవహారాల్లో కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. నేర్చుకోవడానికి, జ్ఞాపకశక్తికి మన మెదడులోని హిప్పోక్యాంపస్ అనే ప్రాంతాన్ని ఘ్రెలిన్ ఉత్తేజితం చేసి, దాని సామార్థ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల మనం చురుగ్గా, చలాకీగా, చేసే పని మీద ఎక్కువ ధ్యాసతో ఉంటాం. అయితే దీనర్థం మనం తినడం మానేయాలని కాదు, కానీ మనమెంత తింటున్నామన్న విషయంపట్ల జాగ్రత్తగ్గా ఉండాలన్న సంగతిని ఇది చెబుతుంది. ఆకలి వేసినప్పుడే తిండి తినాలి. అది కూడా కడుపు పట్టనంత కాకుండా సరిపోయినంత వరకు తినిఆపేయాలి.

ఆహారాన్ని బాగా నమలాలి:

ఆహారాన్ని నమలడమనేది జీర్ణప్రక్రియలో ఎంతో ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. పిండి పదార్థం ఎక్కువగా ఉండే ఆహారాలు లాలాజలం ద్వారానే 30 శాతం జీర్ణం అవుతాయి. ఆహారం తీసుకున్న తరువాత నిద్రకు ఉపక్రమించే ముందు, కనీసం రెండు గంటల వ్యవధి నివ్వండి. జీర్ణప్రక్రియ మీ జీవక్రియను ఉత్తేజితం చేస్తుంది. కాబట్టి, అలాంటి స్థితిలో మీరు నిద్రపోతే, అటు మీకు నిద్రా సరిగ్గా పట్టదు, ఇటు జీర్ణమూ సరిగ్గా కాదు! తిన్న వెంటనే మీరు నిద్రపోతే, మీరేది తిన్నారన్న దాన్ని బట్టి మీరు తీసుకున్న ఆహారంలో ఎక్కువ భాగం జీర్ణమవ్వకుండా పోయే అవకాశం ఉంది. అలాగే భోజనం చేసేటప్పుడు నీళ్ళను తీసుకోకపోవటం కూడా మంచిది. భోంచేయడానికి కొద్ది నిమిషాల ముందో లేదా భోంచేసిన 30 లేదా 40 నిమిషాల తరువాతో కొద్దిగా నీళ్ళు తీసుకోవడం మంచిది.

సరైన సమయానికి సరైన ఆహారం:

వివిధ కాలాల్లో వివిధ రకాల ఆహారాన్ని తీసుకునే సాంప్రదాయం గురించి, మారే వాతావరణానికి తగ్గట్టుగా మన శరీరం తట్టుకునే విధంగా ఆహారం తీసుకోవాలి. భారత దేశంలో, మరీ ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో వేసవి కాలంలో ఒకలా, వానాకాలంలో మరోలా, చలికాలంలో ఇంకోలా, ఆయా కాలాల్లో దొరికే కూరగాయలతో శరీరానికి సరిపడేట్లుగా వండుతారు. మనం ఈ వివేకంతో మన శరీర అవసరాలకు తగ్గట్టుగా, మారే వాతావరణానికి అనుగుణంగా తినడం మంచిది.

సమతుల్యత:

మనం తినే తిండిలో అన్నీ ఉండేలా చూసుకోవాలి. మన శరీరానికి కావల్సిన శక్తి రకరకాల పదార్ధాల నుంచి వస్తుంది. కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ప్రొటీన్లు, కాల్షియం ఇలా చాలా రకాలు మన శరీరానికి రోజూ అవసరం అవుతాయి. ఇవి ఒక్కో పదార్ధంలో ఒక్కోటి దొరుకుతాయి. కాబట్టి అన్నిటినీ కలిపి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సమతుల్య ఆహారం తీసుకోవాలి. అప్పుడు మన శరీరం శక్రమంగా పనిచేస్తుంది.

Advertisment
తాజా కథనాలు