Home Tips: మనం ఎంత కష్టపడినా అన్నం కోసమే. బియ్యాన్ని ఓ రెండు, మూడు నెలలకు సరిపడేలా లేదా సంవత్సరానికి సరిపడా కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకుంటూ ఉంటాం. అయితే అలా నిల్వ చేసుకున్న బియ్యంలో పురుగులు, కొన్ని క్రిములు పట్టి ఇబ్బందులు పెడుతుంటాయి. అంతేకాకుండా ఆ బియ్యాన్ని తింటే అనేక రోగాల బారిన పడుతుంటాం. ప్రస్తుత కాలంలో మార్కెట్లలో కొన్ని బియ్యానికి పురుగు పట్టకుండా పౌడర్లు కూడా లభిస్తున్నాయి. ఈ పౌడర్‌ను బియ్యంలో కలపడం వల్ల బియ్యం పాడవ్వకుండా ఉంటుంది. కాకపోతే ఇలా రసాయనాలు కలిపిన పౌడర్లను వాడటం వల్ల మన ఆరోగ్యానికి హాని జరుగుతుందని నిపుణులు అంటున్నారు.
ఇలా చేస్తే బియ్యంలో పురుగులు పరార్
అందుకే కేవలం ఇంట్లోనే కొన్ని చిట్కాలు ఉపయోగించి బియ్యాన్ని పురుగు పట్టకుండా కాపాడుకోవచ్చు. సాధారణంగా అయితే పురుగు పట్టిన బియ్యాన్ని కడగటం చాలా కష్టంగా ఉంటుంది. పురుగుల్ని ఏరడం కూడా ఇబ్బందికరంగా మారుతుంటుంది. అంతేకాకుండా చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే పురుగు పట్టిన తర్వాత కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. బియ్యం పురుగు పట్టడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. బియ్యంలో కాస్త తేమ ఉన్నా, బియ్యం నిల్వ చేసిన ప్రదేశం దగ్గర తేమ ఉన్నా బియ్యం పురుగు పడుతుంది. ఇంగువను వాడడం వల్ల బియ్యానికి పురుగులు పట్టకుండా చేయవచ్చు. ఇంగువలో ఉండే ఘటైన వాసన పురుగులను దగ్గరకు రానివ్వదు. ఇంగువ చిన్న ముక్కలుగా చేసి మూట కట్టి బియ్యంలో అక్కడక్కడా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల పురుగులు దగ్గరకు రాకుండా ఉంటాయి.
ఇది కూడా చదవండి: గీజర్ వాడితే జుట్టు ఊడుతుందా?..నిపుణులు ఏమంటున్నారు?
అలాగే కర్పూరాన్ని కూడా చిన్న మూటలో కట్టి బియ్యంలో ఉంచితే పురుగులు రావు. పురుగులను సమర్ధవంతంగా తరమికొట్టడంలో వేపాకు బాగా ఉపయోగపడుతుంది. బియ్యం వేసుకునే డబ్బాలో చివరి భాగంలో కాస్త వేపాకు ఉంచి ఆ వేపాకుపై బియ్యాన్ని పోయాలి. లేదా వేప ఆకుల పొడిని మూటగా కట్టి బియ్యంలో ఉంచాలి. ఇలా చేస్తే పురుగులు పట్టవు. అంతేకాకుండా వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి బియ్యంలో వేయడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది. లవంగాలు కూడా పురుగులను తరిమేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. బియ్యంలో లవంగాలు ఉంచడం లేదా లవంగాల పొడిని ఒక బట్టలో కట్టి బియ్యంలో వేయడం వల్ల పురుగులు రావు. అలాగే ఉప్పును కూడా ఒక చిన్న గుడ్డలో కట్టి బియ్యంలో పెడితే పురుగులు తొలగిపోతాయి. మరో చిట్కా ఎండబెట్టిన కాకరకాయ ముక్కల్ని లేదా పొడిని మూట కట్టి బియ్యంలో పెట్టడం వల్ల పురుగులు పట్టకుండా ఉంటాయి. ఇలా చిన్న చిన్న ఇంటి చిట్కాలతో మన బియ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.