Nitin Gadkari On Fuel Vehicles: హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించడంతో పాటు భారతదేశంలో 36 కోట్లకు పైగా పెట్రోల్, డీజిల్ వాహనాలను (Petrol & Diesel Vehicles) తొలగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. "వంద శాతం, ఇది కష్టమే కానీ అసాధ్యం కాదు అని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గడ్కరీ అన్నారు.ఇంధన దిగుమతుల కోసం భారతదేశం రూ. 16 లక్షల కోట్లను ఖర్చు చేస్తుందని, రైతుల జీవితాలను మెరుగుపరచడం, గ్రామ శ్రేయస్సును పెంపొందించడం, యువతకు ఉపాధి కల్పించడం కోసం దీనిని మళ్లించవచ్చని గడ్కరీ చెప్పారు. అయితే, ఈ ప్రతిష్టాత్మక లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుందో తను చెప్పలేను అన్నారు.
దిగుమతిని తగ్గించుకోవచ్చు:
ఇంధన దిగుమతులపై మన దేశం ఏటా రూ.16 లక్షల కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు. ఈ డబ్బు ఆదా అయితే రైతుల జీవితాల మెరుగుదలకు ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. తద్వారా గ్రామాలు సుభిక్షంగా ఉండేలా ప్రణాళికలు తయారు చేయవచ్చని... అలాగే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రమంత్రి తెలిపారు. జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా విదేశాల నుంచి మన దేశం దిగుమతిని నిలువరించగలమని..వాతావరణ సంక్షోభం తలెత్తకుండా చూసేందుకు విద్యుత్ ఉత్పత్తిలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరంఉందని నితిన్ గడ్కరీ అన్నారు. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు.
కాగా బజాజ్, టీవీఎస్, హీరో వంటి ఆటో కంపెనీలు ఫ్లెక్స్ ఇంజన్లను ఉపయోగించి మోటార్‌సైకిళ్లను తయారు చేసేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నాయని గడ్కరీ తెలిపారు. ఆ సాంకేతికతతో ఆటో రిక్షాలను కూడా తయారు చేసే ప్లాన్ ఉందన్నారు. ప్రస్తుతం తను హైడ్రోజన్‌తో నడిచే కారులో తిరుగుతున్నారని, ఫ్యూచర్‌లో ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ కార్లు (Electric Cars) ఉంటాయన్నారు. ఇది అసాధ్యమని చెప్పుకునేవాళ్లు తమ అభిప్రాయాలను మార్చుకునే రోజులు కూడా తొందరలోనే వస్తాయని నితిన్ గడ్కరీ అన్నారు.
ఇది కూడా చదవండి: మహిళలకు షాకింగ్ న్యూస్..భారీగా పెరిగిన బంగారం ధర..రూ. 70వేలు పైనే.!