మునిగిపోతున్న కాంగ్రెస్ నావను తన చాణక్యంతో రేసుగుర్రంలా నిలిపిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాచికలు తెలంగాణలో పారలేదా? నిన్న మొన్నటి వరకు దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి తానే పెద్దదిక్కుగా కనిపించిన డీకే శివకుమార్ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో మాత్రం సైలెంట్ అయిపోయారు. కన్నడ నాట తన రాజకీయ చతురతతో బిజెపిని ముప్పు తిప్పలు పెట్టిన డీకే శివకుమార్... తెలంగాణలో సొంత పార్టీ నేతలను తన మాట వినేలా మార్చుకోలేక పోయారని పొలిటికల్ సర్కిల్స్‌లో తాజాగా వినిపిస్తున్న టాక్. ముఖ్యంగా.. షర్మిల పార్టీ విలీనం విషయంలో డీకేఎస్ ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వలేదు. ఓ దశలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తానే ఒక పెద్ద దిక్కుగా కనిపించిన శివకుమార్ ఎందుకు ఒక్కసారిగా సైడ్ అయిపోయారు? స్థానిక పార్టీ నేతలు డీకేఎస్‌ను ఎందుకు ఖాతరు చేయడం లేదు? కర్ణాటక కాంగ్రెస్ లో తిరుగులేని డీకేఎస్ మాట.. తెలంగాణలో ఎందుకు చెల్లడం లేదు?.. ఈ అంశాలపై ఓ లుక్కేద్దాం..
ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీకి ఏదైనా బూస్ట్ లభించింది అంటే అది కర్ణాటక ఎన్నికల్లో విజయం అనే చెప్పాలి. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న ఈ లిట్మస్ పరీక్షలో విజయవంతంగా బయటపడింది. అయితే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయం వెనుక అప్పటి పిసిసి చీఫ్ డీకే శివకుమార్ ముందుండి పగ్గాలు నడిపించడమే కారణమని పొలిటికల్ సర్కిల్స్ అన్నిట్లోనూ జోరుగా వినిపించిన వాదన. కేంద్ర ఏజెన్సీలు డీకే శివకుమార్ ను టార్గెట్ చేసుకొని పలు దఫాలుగా కేసులు నమోదు చేసినా, ఆయన ఏ మాత్రం కూడా వెరవకుండా, కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చారు. అయితే కాంగ్రెస్ విజయం తర్వాత ఒక్కసారిగా ఆ పార్టీకి డీకే శివకుమార్ ఒక ఆశాజ్యోతి గా కనిపించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో డీకేఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎంత కీలకమైన వ్యక్తియో అర్థం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఆర్థిక పేదరికంలో మగ్గుతున్న సామాన్య జనం..!
తెలంగాణ రాజకీయాల్లో డీకేఎస్ ప్రమేయం:
ఇక కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత ఒక్కసారిగా తెలంగాణలో సైతం పార్టీకి పునరుజ్జీవంపై ఆశలు రేకెత్తాయి. తమ పార్టీ ఇంకా రేసులోనే ఉందని కొద్దిగా కష్టపడితే గెలుపు గుర్రం అవడం పెద్ద కష్టమేమీ కాదని ఆ పార్టీ నేతలు గుర్తించారు. అప్పటి నుంచి డీకే శివకుమార్ తెలంగాణ రాజకీయాల్లో సైతం జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. పనిలో పనిగా బెంగళూరులో సైతం మరో అధిష్టానం తయారైందనే వార్తలు సైతం జోరందుకున్నాయి. ఒకప్పుడు టీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. వారంతా ఒక దశలో బెంగుళూరు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. అధిష్టానం వద్ద డీకేఎస్ మాటకు తిరుగులేదని టీ కాంగ్రెస్ లోని పలువురు నేతలు భావించారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. టికెట్ల పంపిణీ కూడా ప్రారంభమైపోయింది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ 55 మంది జాబితాను విడుదల చేసింది. అయితే వీరిలో ఎంతమందికి డీకేఎస్ ఆశీర్వాదం లభించింది. అనేది మాత్రం శేష ప్రశ్న గానే మిగిలిపోయింది.
తొలిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వైయస్ షర్మిల:
ముఖ్యంగా తెలంగాణలో తొలిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వైయస్ షర్మిల ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనం చేసి ఎన్నికల బరిలో నిలవాలని గంపడని ఆశలు పెట్టుకున్నారు. ఆ బాధ్యతను డీకేఎస్ తలకెత్తుకోవాలని షర్మిల పలుమార్లు ఆయనను సంప్రదించారు. అందుకు తగ్గట్టుగానే డీకేఎస్ సైతం షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని సోనియా గాంధీ స్థాయి వరకు తీసుకెళ్లగలిగారు. అధిష్టానం కూడా డీకేఎస్ కు సానుకూలంగా స్పందించింది. కానీ వైఎస్ షర్మిల పార్టీని ఏపీకి మాత్రమే పరిమితం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే షర్మిల మాత్రం తెలంగాణలో ముఖ్యమైన స్ధానాల్లో పోటీ చేస్తానని చెప్పడంతో...ఈ విషయంలోనే భేదాభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: భారీగా పెరగనున్న గ్రూప్-2 పోస్టులు..నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త!
బెడిసి కొట్టిన డీకేఎస్ వ్యూహం:
షర్మిల పార్టీ తెలంగాణలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది...ఫలితాలు తారుమారు అయినట్లయితే కాంగ్రెస్ కు మైనస్ అవుతుందని అధిష్టానానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు రాజకీయవర్గాల్లో జోరుగా వినిపించింది. అయితే షర్మిల మాత్రం తాను కోరుకున్నట్లు స్థానాలపై అధిష్టానం మౌనంగా ఉండటంతో ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు స్పష్టచేసింది. డీకెఎస్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇటు మోత్కుపల్లి నర్సింహులు సైతం తుంగతుర్తి టికెట్ ఆశించారు. కానీ మోత్కుపల్లికి తుంగతుర్తి టికెట్ ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పేశారు. ఇప్పటికే స్థానిక నేతలతో ఉన్న తలనొప్పులు చాలవని, కొత్త తలనొప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని పిసిసి రేవంత్ రెడ్డికి చెందిన వర్గం అధిష్టానానికి తేల్చి చెప్పేసింది. దీంతో డీకేఎస్ వ్యూహాలు ఫలించలేదు. డీకేఎస్ చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలం కావడంతో ఆయన మౌనంగా ఉండిపోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణలో వైఎస్ షర్మిల, డీకేఎస్ వ్యూహం బెడిసి కొట్టినట్లే చెప్పవచ్చు.
అంతవరకు వస్తే కర్ణాటకలో అఖండ విజయం అందించినటువంటి డీకే శివకుమార్ ను సీఎం పదవిలో కూర్చోబెట్టకుండా ఇప్పటికే ఓసారి సీఎం పదవి అనుభవించిన సిద్ధరామయ్యను మరోసారి సీఎం చేయడం వెనుక కాంగ్రెస్ అధిష్టానం పడిన జాగ్రత్తలు గమనించవచ్చు. కిందపడిన తమ చేయి పైనుండాలని భావించే అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ వచ్చే పవర్ సెంటర్లను అడగొక్కుతూనే తమ ప్రభావాన్ని నిత్యం నిలుపుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు.