Peddapur Gurukul School: ఇటీవల జగిత్యాల జిల్లా (Jagtial) మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి పాము కాటుతో, మరో విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ స్కూల్ లో నెలకొన్న పరిస్థితులపై మీడియాలో విస్తృత కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, పేరెంట్స్ లో భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. ప్రతిపక్షాలు సైతం గురుకులాల్లో నిర్వహణ సరిగా లేదని విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) నేడు ఆ స్కూల్ కు వెళ్లారు. పేరెంట్స్, విద్యార్థులతో స్వయంగా సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారిలో భరోసా కల్పించారు. ఇద్దరు విద్యార్థుల మృతి, నలుగురు విద్యార్థుల అస్వస్థతకు గురికావడానికి సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. విద్యార్థుల మృతి ప్రభుత్వాన్ని కలిచివేసిందన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జగరకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో స్కూల్ లో జరిగిన పరిణామాలను స్వయంగా తెలుసుకోవడానికే పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు వచ్చానన్నారు.
Also Read: రుణమాఫీ కానివారికి శుభవార్త.. త్వరలోనే స్పెషల్ డ్రైవ్!
కేవలం ఈ ఒక్క పాఠశాలనే కాకుండా.. రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. ఆయా పాఠశాలలకు అవసరమైన నిధులను కేటాయిస్తామన్నారు. గురుకుల పాఠశాలలకు ప్రహరీతో కూడిన పక్కా భవనాలను నిర్మిస్తామన్నారు. అత్యంత పరిశుభ్రంగా వాటిని తీర్చిదిద్దుతామన్నారు. మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు గురుకులాల్లో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు భట్టి విక్రమార్క.