Sukesh Chandrashekhar: లిక్కర్ కేసులో పొలిటికల్ లీడర్స్‌తో పాటు ప్రధానంగా వినిపిస్తున్న పేరు సుఖేష్ చంద్రశేఖర్. ప్రస్తుతం మనీ లాండరింగ్ కేసులో (Money Laundering Case) జైలులో ఉన్న సుఖేష్... బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై (MLC Kavitha Arrest) లేఖ రాసి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలోనూ బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారు సుఖేష్. అసలు ఎవరీ సుఖేష్ చంద్రశేఖర్. ప్రస్తుతం జైలులో ఎందుకు ఉన్నారు. కవితతో (MLC Kavitha) సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధం ఏంటి. ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
17ఏళ్ల నుంచే మొదలు:
సుఖేష్ చంద్రశేఖర్..కర్ణాటక రాజధాని బెంగళూరులోని దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పదో తరగతిలో డ్రాపవుట్ అయిన చిన్నతనం నుంచే లక్షలు సంపాదించాలని కలలు కన్నాడు. విలాసవంతమైన జీవితం గడిపేందుకు రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. కారు రేసులను నిర్వహించడంలో పేరు సంపాదించాడు. 17 ఏళ్ల వయసులోనే కర్ణాటకలో కారు రేసులను ఎక్కడైనా నిర్వహించేందుకు బెంగళూరు సీపీ పేరుతో ఫేక్ లెటర్ సృష్టించాడు. 2007లో ఓ వ్యాపారవేత్తను రూ.కోటి 15 లక్షలు మోసం చేసిన కేసులో తొలిసారిగా సుఖేష్ అరెస్టయ్యాడు. తర్వాత తన మకాం చెన్నైకి మార్చాడు.
జాక్వెలిన్‌తో రొమాన్స్:
అయితే సీఎం కొడుకునని, పీఎంవో అధికారినని, సుప్రీంకోర్టు జడ్జినని నమ్మించి రూ. 200 కోట్లు మోసం చేసిన కేసులో సుఖేష్ అరెస్ట్ అయ్యాడు. అరెస్టు అయిన తర్వాత సుఖేష్ అసలు బండారం బయటపడింది. సుఖేష్ చేతిలో మోసపోయిన వారిలో బెంగళూరు, చెన్నైకి చెందిన పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అలా ఎంత సంపాదించాడంటే బాలీవుడ్ భామలతో ఎంజాయ్ చేసేంత.. సొమ్ము కూడబెట్టాడు. నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌లకు (Jacqueline Fernandez) కోట్ల విలువైన బహుమతులు ఇచ్చాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో సుఖేష్ కలిసి ఉన్న ఫోటోలు అప్పట్లో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఐతే చివరిగా ఓ మోసగాడిగా సుఖేష్ మిగిలిపోయాడు. ప్రస్తుతం సుఖేష్‌పై 15కు పైగా FIRలు నమోదయ్యాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోనూ (Delhi Liquor Scam) సుఖేష్‌కు సంబంధం ఉంది. గతంలో కవితపై సంచలన ఆరోపణలు చేశారు సుఖేష్. కవితతో తాను చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్ విడుదల చేసి సంచలనం సృష్టించాడు. తాజాగా.. మరోసారి కవిత అరెస్ట్‌పై సుఖేష్ స్పందించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కవితకు సుఖేష్ లేఖ:
కవితకు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ (Sukesh Chandrashekhar Letter) రాయడం కాకరేపుతోంది. కవితను ఉద్దేశిస్తూ.. 'తీహార్ జైలు కౌంట్‌డౌన్ మీకు ప్రారంభమైంది. త్వరలో మీరు తీహార్ జైలు క్లబ్ లో సభ్యులు కాబోతున్నారు. మీతో పాటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కూడా త్వరలోనే అరెస్ట్ అవుతారు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచుకున్న మీ అక్రమ సంపాదన అంతా బయటపడనుంది. అన్నింటి మీదా దర్యాప్తు జరుగుతోంది. వాట్సాప్ చాటింగ్, కాల్స్ అన్నీ బయటకు వస్తాయి' అంటూ సుఖేష్ లేఖలో రాశారు. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను కాపాడేందుకు ప్రయత్నం చేయవద్దు అంటూ కవిత సలహా ఇచ్చాడు సుఖేష్. కేసు విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దని... అన్ని వివరాలతో సహా కావాల్సిన సాక్ష్యాలు కూడా కోర్టుకు తెలుసని చెప్పాడు. మీరందరూ తీహార్ జైలుకు రావడం గ్యారంటీ అని.. మీకు స్వాగతం పలకడానికి తాను రెడీగా ఉంటా అంటూ సుఖేష్ లేఖలో పేర్కొన్నాడు.
Also Read: సుప్రీం కోర్టులో కవిత రిట్ పిటిషన్