Kejriwal: ఢిల్లీ బస్సుల్లో ఉచిత ( Free bus) ప్రయాణానికి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)సోమవారం కీలక ప్రకటన చేశారు. ఇప్పుడు ఢిల్లీ బస్సుల్లో మహిళల తర్వాత ట్రాన్స్‌జెండర్లు కూడా డీటీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.మన సామాజిక వాతావరణంలో ట్రాన్స్‌జెండర్లు (Transgenders)చాలా వరకు నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఇలా జరగూడదని.. వారు కూడా మనుషులే, వారికి కూడా సమాన హక్కులు ఉన్నాయన్నారు. ఇకపై ట్రాన్స్‌జెండర్లకు కూడా ఢిల్లీ బస్సుల్లో ప్రయాణం పూర్తిగా ఉచితం అని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే మంత్రివర్గం ఆమోదించి అమలు చేస్తామని సీఎం తెలిపారు. ఈ నిర్ణయం వల్ల కిన్నార్ కమ్యూనిటీ ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతారని నేను పూర్తిగా ఆశిస్తున్నాను అంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఢిల్లీ ప్రభుత్వ ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, సీనియర్ సిటిజన్ల(Senior citizens)కు తీర్థయాత్ర పథకం 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగుతుందని గత ఏడాది బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు ఆర్థిక మంత్రి కైలాష్ గెహ్లాట్(Kailash Gehlot) ప్రకటించారు. సాంఘిక సంక్షేమ శాఖకు ఈ ఏడాది మొత్తం రూ. 4,744 కోట్లు కేటాయించామని, ఇందులో వృద్ధులు, మహిళలు, వికలాంగులు, అణగారిన వర్గాలతో సహా 8.82 లక్షల మంది లబ్ధిదారులకు రూ 2,962 కోట్లు పింఛను కోసం ప్రతిపాదించామని మంత్రి తెలిపారు.
డిటిసి, క్లస్టర్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అక్టోబర్ 29, 2019 నుండి ప్రారంభమైంది. 2021-22లో, మహిళా ప్రయాణికులు డిటిసిలో 13.04 కోట్ల ఉచిత ప్రయాణాలను, క్లస్టర్ బస్సుల్లో 12.69 కోట్ల మంది ఉచితంగా ప్రయాణించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో డిటిసీలో రోజువారీ సగటు ప్రయాణీకుల సంఖ్య 15.62 లక్షలు , క్లస్టర్ బస్సులలో 9.87 లక్షలు గా ఉంది.
ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన (Chief Minister Tirtha Yatra Yojana)కింద ప్రభుత్వం సీనియర్ సిటిజన్లను అయోధ్య, వారణాసి, ద్వారకాధీష్, పూరీ, అజ్మీర్ షరీఫ్‌లతో సహా 15 ప్రాంతాలకు తీర్థయాత్రలకు తీసుకువెళ్లిందని గెహ్లాట్ చెప్పారు. వివిధ సబ్సిడీల కోసం ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్ లో రూ. 4,788 కోట్లుగా అంచనా వేసిందని తెలిపారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ది క్యాన్సర్ కల్చర్.. లోక్ సభలో రాహుల్ ని ఉతికేసిన మోదీ..!!