Anakapalli: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో ఈరోజు మధ్యాహ్నం రియాక్టర్ పేలి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 16 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 50మందికి పైగా గాయపడ్డారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకొని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రియాక్టర్ పేలుడుతో కుప్పకూలిన భవనం ఫస్ట్ ఫ్లోర్ పైకప్పు శిథిలాల కింద మరికొందరి మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు మొత్తం 22 మంది వరకు చనిపోయి ఉంటారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
ఫార్మా సెజ్‌లో భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో పక్కనున్న గ్రామ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. సెజ్‌లో మంటను అదుపులోకి తేవడానికి 11 అగ్ని మాపక వాహనాలు వచ్చాయి. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బందితో సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతన్నాయి. మొదటి అంతస్తు శ్లాబు కింద పడి ఏడుగురు మృతి చెందారు. గాయపడ్డ వారిలో ఐదుగురు 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో రెండో షిఫ్ట్‌లోని దాదాపు 380 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్టు సమాచారం.
చంద్రబాబు పరామర్శ..
అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ తో సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ విషయమై కలెక్టర్లకు ఆయన పలుమార్లు ఫోన్లు చేశారు. దాంతో పాటూ హెల్త్ సెక్రటరీని తక్షణమే అచ్యుతాపురం వెళ్లాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ను ఆదేశించారు. క్షతగాత్రులను తరలించేందుకు అవసరమైతే ఎయిర్ అంబులెన్సులు వినియోగించాలని చెప్పారు. ఇక రేపు ప్రమాద ఘటన స్థలికి సీఎం చంద్రబాబు వెళ్ళనున్నారు. క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నారు.