Remal Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని వాతావరణశాఖాధికారులు తెలిపారు. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారనుందని భారత వాతావరణ సంస్థ (IMD) వెల్లడించింది. ఈ తుపానుకు రెమాల్ అని నామకరణం కూడా చేశారు.
కాగా, ఈ నెల 25వ తేదీ రాత్రికి తీవ్ర తుపానుగా బలపడి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య రెమాల్ తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఈ నెల 25, 26 తేదీల్లో ఉత్తర ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. ఈ నెల 26, 27 తేదీల్లో పశ్చిమ బెంగాల్ లోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
ఈ నెల 28 వరకు బెంగాల్ లో వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఏపీ పై మాత్రం ఈ తుపాను ప్రభావం ఏమాత్రం ఉండదని, రాష్ట్రంలో ఎండలు మండిపోతాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఏపీలో వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ వివరించింది.
Also read: నగర వాసులకు అలర్ట్..ఈ రూట్లలో రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు!