ఫిబ్రవరి 21 నుంచి మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జాతరకు సంబంధించి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో వివిధ శాఖలో ఉన్నతాధికారులతో కలిసి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. జాతరకు ముందు నుంచే మేడారానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని.. జాతర ప్రారంభం అయిన తర్వాత ఇంకా ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Also Read: తమపై బురదజల్లేందుకే.. శ్వేతపత్రంపై హరీష్ ఫైర్!
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే జాతరలో దాదాపు 4800 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి దాదాపు 6 వేల బస్సులు మేడారానికి నడుపుతున్నామని.. 55 ఎకరాల విస్తీర్ణంలో అక్కడ తాత్కాలిక బస్టాండ్ కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ నెల 18 నుంచి 26 వరకు బస్సులు నడపనున్నట్లు చెప్పారు.
జాతరలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని.. ఇప్పటికే నాలుగు వేల మంది కార్మికులను నియమించినట్లు సీఎస్ తెలిపారు. అలాగే విద్యుత్ సరఫరాకు కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేకంగా సబ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక మేడారం గద్దెలను దర్శించుకునే వారి కోసం క్యూలైన్స్ ఏర్పాట్లు పూర్తి చేశామని.. గద్దెల వద్ద నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. అలాగే జాతర వివరాలు అందించేందుకు అక్కడ ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటుతో పాటు.. ఫొటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నారమని తెలిపారు.
ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరగనుంది.
Also Read: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సంచలన విషయాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్