CS Shanthi kumari: హైడ్రాకు మరిన్ని అధికారాలు.. కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు!

ప్రభుత్వ స్థలాలు, ఆస్తులు, చెరువుల పరిరక్షణపై పక్కా ప్రణాళిక రూపొందించాలని సీఎస్ శాంతికుమారి అధికారులకు సూచించారు. హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని హైడ్రాకు మరిన్ని అధికారాలు, సిబ్బందిని ఏర్పాటు చేసేలా విధి విధానాలు ఖరారు చేయాలని తెలిపారు.

New Update
CS Shanthi kumari: హైడ్రాకు మరిన్ని అధికారాలు.. కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు!

CS Shanthi Kumari: చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు సూచించారు. గురువారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర హై-కోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఓ.ఆర్.ఆర్ పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రాకు అప్పగించేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు.

హైడ్రాకు మరిన్ని అధికారాలు..
ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకై హైడ్రాకు మరిన్ని అధికారాలను, సిబ్బందిని అప్పగించేలా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఇంటలీజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ మహేష్ భగవత్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, హెచ్ఎండీఏ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అడిషనల్ అడ్వకెట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, ఎసిబి డైరెక్టర్ తరణ్ జోషి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.

అన్ని విధాలా ఆక్రమణల తొలగింపు..
ఈ సందర్భంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపుపై ప్రస్తుతం నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ, పురపాలక శాఖ, పంచాయితీ రాజ్, వాల్టా తదితర విభాగాలు వేర్వేరుగా నోటీసులు జారీ చేస్తున్నారు. దీనివల్ల ఒకరకమైన కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. దీనిని నివారించటానికి ఓ.ఆర్.ఆర్.పరిధిలో అన్ని విధాలా ఆక్రమణల తొలగింపు నోటీసులను హైడ్రా ద్వారానే చేపట్టేందుకు విధి విధానాలు ఖరారు చేయాలంటూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ఇక జీ.హెచ్,ఎంసీ, ల్యాండ్ ఏంక్రోచ్మెంట్ ఆక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ ఆక్ట్, వాల్టా చట్టం, నీటిపారుదల శాఖ చట్టాల ద్వారా జారి చేసే అన్ని రకాల నోటీసులు, తొలగింపులన్నీ పూర్తిగా ఒకే విభాగం హైడ్రా పరిధిలోకి తేనున్నట్టు వివరించారు. హైడ్రాకు కావాల్సిన అదనపు అధికారులు, సిబ్బందిని త్వరలోనే కేటాయించనున్నట్టు తెలిపారు.

హైడ్రా పరిధిలోకి జల మండలి..
అలాగే ఎఫ్.టీ.ఎల్, నాలా ఎంక్రోచ్మెంట్, ప్రభుత్వ కాళీ స్థలాలు, పార్కుల పరిరక్షణలను హైడ్రా పరిధిలోకి తేనున్నట్లు చెప్పారు. గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ కూడా జల మండలి నుంచి హైడ్రా పరిధిలోకి తేనున్నామని వెల్లడించారు. హైడ్రా ఆధ్వర్యంలో మొత్తం 72 బృందాలు ఏర్పాటయ్యాయని, వీటిని మరింత బలోపేతం చేయాడానికి కావాల్సిన పోలీస్, సర్వే, నీటిపారుదల శాఖల నుండి అధికారులు, సిబ్బందిని త్వరితగతిన కేటాయించనున్నట్టు సి.ఎస్. తెలిపారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, రంగారెడ్డి జిలా కలెక్టర్ శశాంక, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పౌత్రు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు