/rtv/media/media_files/2025/08/14/delhi-crime-2025-08-14-13-24-05.jpg)
దేశరాజధానిలో మరో దారుణం జరిగింది. బాత్రూంలో 24 ఏళ్ల ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. అంతేకాకుండా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. ఉత్తర ఢిల్లీ సివిల్ లైన్స్‌లో ఆదివారం రాత్రి ఘటన చోటుచేసుకుంది. గురుగ్రామ్‌లోని ఓ సంస్థలో పనిచేస్తున్న బాధితురాలు.. ఆదివారం ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి హాజరైంది. అక్కడ మద్యం సేవించి స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను బాత్రూంలోకి లాక్కెళ్లిన నలుగురు యువకులు అత్యాచారం చేశారు. స్పృహలోకి వచ్చాక ఎవరికైనా చెబితే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. అనంతరం ఇంటి బయట యువతిని దింపి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె స్నేహితుడితో సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల కోసం యువతిని ఆసుపత్రికి పంపారు.
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి
మరో సంఘటనలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి 32 ఏళ్ల మహిళపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముండ్కా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తన భర్త, పిల్లలతో బెంగళూరులో నివసిస్తున్నానని, కానీ భర్త దాడుల నుండి తప్పించుకోవడానికి ఢిల్లీకి పారిపోయానని ఆ మహిళ దర్యాప్తులో పోలీసులకు వెల్లడించింది. నిందితుడు తనకు రైలు ప్రయాణంలో పరిచయం అని, ఢిల్లీలో వసతి, ఉద్యోగం కల్పిస్తానని చెప్పి నమ్మబలికాడని తెలిపింది. ఆదివారం ఓ ఇంటిని అద్దెకి చూపించి అదే ఇంటికి రాత్రి మద్యం తాగి వచ్చి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో వెల్లడించింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 22ఏళ్ల దివ్యాంగురాలిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బైక్‌లపై వెంటాడి, ఎత్తుకెళ్లి మరీ నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సీసీకెమెరాల సాక్షిగా ఈ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. యువతి రోడ్డుపై పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాధితురాలు ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని పొలాల్లో ఆమె పడి ఉండటం గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఉన్నతాధికారుల నివాసాలకు కొంత దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
దీనిపై బాధిత కుటుంబ సభ్యులు బలరాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జరిగిన 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు పోలీసులు. నేపాల్ కు పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించగా పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. నిందితులను అంకుర్ వర్మ(21), హర్షిత్ పాండే(22) గా గుర్తించారు. నిందితులను పట్టుకునే క్రమంలో వారిపై కాల్పులు జరిపారని పోలీసు సూపరింటెండెంట్ వికాస్ కుమార్ తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.