/rtv/media/media_files/2025/10/08/wife-pours-boiling-oil-2025-10-08-20-24-40.jpg)
దేశ రాజధాని ఢిల్లీలో కట్టుకున్న భర్తపై భార్య కర్కషంగా వ్యవహరించింది. మదన్‌గీర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న దినేష్ అనే వ్యక్తిపై అతని భార్య అత్యంత కిరాతకంగా దాడి చేసింది. తెల్లవారుజామున భర్త గాఢ నిద్రలో ఉండగా, సలసల మరుగుతున్న నూనెను, ఎర్రటి కారంపొడిని అతని శరీరంపై పోసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దినేష్‌ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేసే దినేష్ (28) అక్టోబర్ 2న రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. తెల్లవారుజామున 3:15 గంటల ప్రాంతంలో దినేష్‌కు ఒక్కసారిగా తీవ్రమైన మంట, నొప్పి కలగడంతో నిద్ర నుంచి లేచి చూశాడు. అప్పటికే అతని భార్య అతని ముఖం, శరీరంపై మరిగే నూనె పోసింది. తీవ్ర వేదనతో అరుస్తున్న దినేష్ కాలిన గాయాలపై ఆమె ఎర్రటి కారంపొడిని చల్లింది.
నొప్పి తట్టుకోలేక దినేష్ కేకలు వేయడంతో, అతని భార్య గట్టిగా అరిస్తే ఇంకొంచెం నూనె పోస్తానని" బెదిరించింది. దినేష్ అరుపులు విని కింద అంతస్తులో ఉన్న ఇంటి యజమాని కుటుంబ సభ్యులు పైకి వచ్చారు. అయితే, భార్య లోపలి నుంచి తలుపుకు తాళం వేసింది. కొంత సమయం తర్వాత ఆమె తలుపులు తీయగా, తీవ్ర గాయాలతో విలవిలలాడుతున్న దినేష్‌ను చూశారు. వెంటనే ఇంటి యజమాని అతన్ని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం దినేష్‌ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు.
దినేష్, అతని భార్యకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె కూడా ఉంది. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం కూడా భార్య అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఈ తాజా ఘటనపై దినేష్ ఫిర్యాదు మేరకు అతని భార్యపై పలు సెక్షన్ల కింద అంబేద్కర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.