UP Crime : నీ కూతురికి కన్యత్వ పరీక్ష చేయించు.. పై క్లాసుకు ప్రమోట్ చేస్తా..  మదర్సా ఉద్యోగి అరెస్టు!

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ మదర్సాలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి మైనర్ బాలిక పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

New Update
up crime

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ మదర్సాలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి మైనర్ బాలిక పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొరాదాబాద్‌లో 13 ఏళ్ల 8వ తరగతి విద్యార్థినిని తదుపరి తరగతికి ప్రమోట్ చేసే ముందు కన్యత్వ పరీక్ష చేయించాలంటూ డిమాండ్ చేశాడు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. 

చండీగఢ్‌కు చెందిన మొహమ్మద్ యూసుఫ్ అనే వ్యక్తి కుటుంబం మొరాదాబాద్‌లో నివసిస్తోంది. మొరాదాబాద్‌లోని జామియా ఎహసానుల్ బనాత్ బాలికల మదర్సాలో చదువుతున్న ఆయన కూతురు కొంతకాలం పాటు మదర్సాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గైర్హాజరైంది. బాలిక తండ్రి మొహమ్మద్ యూసుఫ్ తిరిగి అడ్మిషన్ కోసం మదర్సాను ఆశ్రయించినప్పుడు, అధికారులు అడ్మిషన్ ఇవ్వడానికి నిరాకరించారు. ఆ సమయంలోనే, బాలిక తదుపరి తరగతికి ప్రమోట్ అవ్వాలంటే, ఆమెకు కన్యత్వ పరీక్ష చేయాలని డిమాండ్ చేశారని యూసుఫ్ ఆరోపించారు. 

వైద్య పరీక్ష చేయాలని మదర్సా జారీ చేసిన పత్రాల కాపీలను కూడా యూసుఫ్ పోలీసులకు సమర్పించారు. ఎస్పీ సిటీ కుమార్‌ రణ్‌విజయ్‌ సింగ్ మాట్లాడుతూ, బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు మదర్సా అడ్మిషన్ ఇన్‌ఛార్జి షహజాన్, ప్రిన్సిపాల్ రహనుమా, ఇతర సిబ్బందిపై తీవ్ర ఆరోపణల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలిందని,  అడ్మిషన్ ఇన్‌ఛార్జి షహజాన్‌ను అరెస్టు చేసి జైలుకు పంపామన్నారు.  మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. 

ఖండించిన మదర్సా ఉపాధ్యాయుడు

మదర్సా ఉపాధ్యాయుడు మొహమ్మద్ సల్మాన్ మాట్లాడుతూ, ఈ ఆరోపణలు నిరాధారమైనవని ఖండించారు. ఏ విద్యార్థిని నుంచి కూడా అలాంటి సర్టిఫికెట్ ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. వందలాది మంది బాలికలు గౌరవంగా చదువుకునే సంస్థపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ సంస్థ మదర్సాగా,  ఇంటర్-కాలేజీగా పనిచేస్తుంది. 

Advertisment
తాజా కథనాలు