TG News: ఖమ్మం జిల్లాలో అర్థరాత్రి హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. గొల్లగూడెం ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థిని భూక్యా ప్రతిమ అనుమాస్పదంగా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ప్రాథమిక వివరాల ప్రకారం.. బాలిక ఉదయం పరీక్ష రాస్తుండగా మూర్ఛ వచ్చి పడిపోయింది. దీంతో పాఠశాల సిబ్బంది ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు వైద్యులు. దీంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న ప్రతిమ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ కూతురికి ఎటువంటి అనారోగ్యం లేదని, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే తన కూతురికి మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల ఆందోళనకు విద్యార్ధి సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. పాఠశాల వార్డెన్, డీడీని సస్పెండ్ చేయాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బాలిక మృతి గురించి తల్లిదండ్రులకు చెప్పడంలో ఎందుకు జాప్యం వహించారు అని పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
అర్థరాత్రి హై టెన్షన్
అర్థరాత్రి ఆస్పత్రి ముందు హై టెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు పలువురిని అరెస్ట్ కూడా చేసినట్లు సమాచారం. అనంతరం ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా అడిషనల్ కలెక్టర్, ఖమ్మం ఆర్డీవో ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రతిమ కుటుంబ సభ్యులు, విద్యార్ధి సంఘాల నేతలతో మాట్లాడి పరిస్థితి గురించి ఆరా తీశారు. బాలిక మృతి విషయంలో బాధ్యతరహితంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.