/rtv/media/media_files/2025/09/22/facebook-live-2025-09-22-19-54-05.jpg)
కేరళలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కొల్లాం జిల్లా పునలూర్ సమీపంలోని కూతనడిలో ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి చెప్పాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.
ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. కూతనడికి చెందిన ఐజాక్ (50) అనే వ్యక్తి తన భార్య షాలిని (39)ని హత్య చేశాడు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భార్య షాలిని భర్తని ఆమెకు దూరంగా వెళ్లిపోవాలని డిమాండ్ చేయడంతో ఐజాక్ కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆమెపై కత్తితో దాడి చేశాడు. దాంతో షాలిని అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
హత్య అనంతరం, ఐజాక్ తన ఫేస్‌బుక్ ఖాతాలో లైవ్ వీడియోలో తానే ఈ హత్య చేశానని ఒప్పుకున్నాడు. భార్యపై ఉన్న అనుమానాలను, ఆభరణాల విషయంలో జరిగిన వివాదాన్ని ఆ వీడియోలో వెల్లడించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. కొద్దిసేపటి తర్వాత ఐజాక్ స్వయంగా పోలీసు స్టేషన్‌లో లొంగిపోయి తన నేరాన్ని అంగీకరించాడు.
పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారని, వారిలో 19 ఏళ్ల కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఐజాక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన కేరళలో తీవ్ర కలకలం రేపింది.