/rtv/media/media_files/2025/10/23/jaipur-ex-ministers-son-charged-for-rash-driving-audi-car-2025-10-23-09-40-19.jpg)
jaipur ex ministers son charged for rash driving audi car
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో మాజీ మంత్రి రాజ్‌కుమార్ శర్మ కుమారుడు అతివేగంతో ఆడి కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. ఈ ప్రమాదంలో మూడు వాహనాలను ఢీకొట్టగా, స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత మాజీ మంత్రి కుమారుడు.. క్షతగాత్రులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, వారిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..
ex ministers son rash driving
మాజీ మంత్రి మైనర్ కుమారుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆడి కారులో ప్రయాణిస్తున్నాడు. వేగం అదుపు తప్పడంతో ఆడి కారు ముందున్న మూడు వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం తీవ్రంగా ఉండడంతో ఆడి కారు ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నాయి. అదే సమయంలో స్విఫ్ట్ కారు ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో గాయపడిన పుల్కిత్ పారిక్ అనే యువకుడు, తన స్నేహితురాలు సురభితో కలిసి తన సోదరుడి చికిత్స కోసం రక్తాన్ని తీసుకుని ఠాకురియా హాస్పిటల్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
3 Injured As MLA's Son Rams Audi Into 2 Cars, Attacks Man Driving One Of Them https://t.co/PwewBEwQyspic.twitter.com/7OtIIWdwJS
— NDTV (@ndtv) October 22, 2025
మధ్యాహ్నం 2:11 గంటల ప్రాంతంలో ఎన్‌ఆర్‌ఐ సర్కిల్ వద్ద వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన ఆడి కారు తమ స్విఫ్ట్ కారుని ఢీకొట్టిందని పుల్కిత్ తెలిపాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారు దిగిన నిందితుడు.. తనను తాను మాజీ మంత్రి రాజ్‌కుమార్ శర్మ కుమారుడిగా చెప్పుకున్నాడు. "నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నీ కారును రిపేర్ చేయిస్తాను" అంటూ బెదిరించాడు. ఈ క్రమంలోనే అతడు తన స్నేహితులతో కలిసి క్షతగాత్రులైన పుల్కిత్, సురభిలపై చేయి చేసుకుని దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు.
బాధిత యువకుడు పుల్కిత్ పారిక్ తన ఫిర్యాదులో ప్రతాప్ నగర్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు తమకు ఆసుపత్రికి వెళ్లడానికి సహాయం చేయలేదని, పైగా నిందితుడిని అక్కడికక్కడే వదిలేశారని ఆరోపించారు. అంతేకాకుండా ఫిర్యాదు నమోదు చేయడంలోనూ పోలీసులు సుమారు 5 గంటలు జాప్యం చేశారని తెలిపారు.
ప్రస్తుతం బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రతాప్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అధికార పార్టీ నేతల పిల్లల అత్యుత్సాహం, పోలీసుల నిర్లక్ష్యంపై రాజధానిలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మైనర్ కుమారుడికి కారు ఎలా ఇచ్చారనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.
Follow Us