/rtv/media/media_files/2025/09/13/husband-attack-wife-jhansi-in-uttar-pradesh-2025-09-13-10-51-02.jpg)
Husband Attack Wife Jhansi in Uttar Pradesh
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో దారుణం జరిగింది. గరౌతా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో.. 27 ఏళ్ల బ్యూటీషియన్ సఫీనాపై ఆమె భర్త షాని బ్యూటీ పార్లర్ లోపల కత్తితో దాడి చేశాడు. ముఖం, మెడపై దాడి చేయడంతో సఫీనా తీవ్రంగా గాయపడింది. అనంతరం అక్కడ నుంచి పారిపోయాడు. అయితే మరి ఎందుకు దాడి చేశాడు అనే విషయానికొస్తే..
Husband Attack Wife in Uttar Pradesh
సఫీనాకు మౌరానిపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసించే షానితో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితానికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. అయితే వివాహం జరిగినప్పటి నుండి ఇద్దరి మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు తీవ్ర కోపానికి గురైన భర్త షాని తన భార్య సఫీనాపై కాల్పులు జరిపాడు. ఈ ప్రమాదంలో ఆమెకు పెద్దగా ఏం కాలేదు.
దీంతో భార్య సఫీనా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. అక్కడే ఉంటూ బ్యూటీ పార్లర్ నడపడం ప్రారంభించింది. ఈ దాడి అనంతరం ఆమె తన భర్తపై కోర్టులో విడాకుల కేసు దాఖలు చేసింది. అప్పటి నుండి ఈ కేసు ఇప్పటి వరకు పెండింగ్‌లోనే ఉంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 12వ తేదీ సాయంత్రం సఫీనా తన బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తుండగా.. ఆమె భర్త షాని అక్కడికి చేరుకున్నాడు. ఆపై ఒక్కసారిగా ఆమెపై కత్తితో దాడి చేశాడు.
ముఖం, మెడపై దాడి చేయడంతో సఫీనా తీవ్రంగా గాయపడింది. ఆమెపై దాడి చేసిన అనంతరం షాని అక్కడ నుంచి పరారయ్యాడు. గమనించిన చుట్టుపక్కల ప్రజలు ఆమెను గుర్సరాయ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను మెడికల్ కాలేజీకి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. కేసు గురించి సమాచారం సేకరించారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడ్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ సంఘటనపై గాయపడిన మహిళ సోదరి నస్రీన్ మాట్లాడుతూ.. నిందితుడు గతంలో సఫీనాపై కాల్పులు జరిపాడని, ఈసారి ఆమెను చంపాలనే ఉద్దేశ్యంతో కత్తితో దాడి చేశాడని చెప్పారు. సఫీనా ఝాన్సీ మెడికల్ కాలేజీలో చేరిందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీస్ సర్కిల్ ఆఫీసర్ (సిఓ) గరౌతా అస్మా బకర్ తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.