/rtv/media/media_files/2025/08/18/addanki-2025-08-18-06-49-33.jpg)
వడ్డీ వ్యాపారుల వేధింపుల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడేపల్లిలోని నులకపేటలో జరిగింది. ఆమె చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియోలో రికార్డు చేయగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా నాలుగు పేజీల లేఖ కూడా రాసింది. ఆమె సెల్ఫీ వీడియో ప్రకారం.. అద్దంకి కృష్ణప్రియ, కృష్ణతేజ దంపతులు నులకపేటలో నివాసం ఉంటున్నారు. కృష్ణతేజ దుర్గాఘాట్‌లో పురోహితులుగా పనిచేస్తున్నారు. అయితే తన చావుకు విజయవాడ దుర్గాఘాట్‌లో వడ్డీ వ్యాపారం చేసే దుక్కా వేణు, దుక్కా శ్రీను, బాజి ప్రసాద్ కారణమంటూ కృష్ణప్రియ తన సెల్ఫీ వీడియోలో వెల్లడించింది. ఇందుకు కారణాలను పోలీసు వారికి రాసి ఇస్తున్నాను అంటూ ఆమె తన వీడియోలో తెలిపింది.
రూ.50 వేలు అప్పుగా
2016లో దుర్గాఘాట్‌లో వడ్డీ వ్యాపారం చేసే దుక్క వేణు, దుక్క శ్రీనివాస్ అనే అన్నదమ్ముల దగ్గర తన భర్త కృష్ణతేజ రూ.50 వేలు అప్పుగా తీసుకున్నారని కృష్ణప్రియ తెలిపారు. అందుకుగానూ ఖాళీ చెక్కు, ప్రామిసరీ నోటుపై సంతకాలు పెట్టించి వారు తీసుకెళ్లారని ప్రస్తావించారు. 2017లో అప్పులో రూ.15 వేల వరకు చెల్లించామని, గతంలో తన భర్త ఊరులో లేనప్పుడు వేణు, శ్రీను, రామకృష్ణ, విశ్వనాథన్ రవి అనే వాళ్లు తమ ఇంటికి వచ్చి వడ్డీ కట్టలేదంటూ గొడవ చేశారని.. వారి వేధింపులు తట్టుకోలేక తన భర్త తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా ఆమె వెల్లడించారు.
అయితే ఈ నెల 13న తాను విజయవాడ వెళ్లిన సమయంలో ఈ వడ్డీ వ్యాపారులంతా కలిసి తమపై వేధింపులకు పాల్పడ్డారని, వారన్న మాటలు భరించలేకపోతున్నానని కృష్ణప్రియ ఆవేదన వ్యక్తం చేసింది. తన చావుకు ఆ ముగ్గురు వడ్డీ వ్యాపారులే కారణమని పేర్కొన్న ఆమె.. ‘బుజ్జి నన్ను క్షమించు. నావల్ల కావడం లేదు. నేను భరించలేకపోతున్నాను. అందుకని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఐలవ్‌యూ బుజ్జీ, మిస్‌యూ బుజ్జీ’ అంటూ లేఖలో రాశారు. తన శవాన్ని తన భర్తకే అప్పగించాలని, హోంమంత్రి అనిత, పోలీసులు తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా
ఇటీవల కాలంలో, లోన్ యాప్‌ల (loan apps) వేధింపుల కారణంగా కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ యాప్‌లు తక్కువ మొత్తంలో అప్పులు ఇచ్చి, అధిక వడ్డీలతో పాటు, రుణగ్రహీతలను బెదిరించడం, వారి ఫోన్ కాంటాక్టులకు ఫోన్ చేసి అవమానించడం వంటివి చేస్తున్నాయి. విశాఖపట్నంలో ఒక యువకుడు కేవలం రూ. 2000 లోన్ కోసం తీసుకున్న అప్పు వల్ల వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మోసపూరితంగా ఫ్రేమ్ చేసి, మార్ఫింగ్ చేసిన చిత్రాలను పంపించి వేధించిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి.