/rtv/media/media_files/2025/10/23/bihar-train-accident-2025-10-23-06-38-33.jpg)
Bihar train accident
బీహార్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బెగుసరాయ్ జిల్లాలో రైలు పట్టాలు దాటుతున్న నలుగురు వ్యక్తులు రైలు ఢీకొని దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒక మహిళ, ఆమె కుమార్తెతో పాటు మరో చిన్నారి, ఒక వ్యక్తి ఉన్నారు. బుధవారం రాత్రి ఆలస్యంగా ఈ హృదయ విదారక ఘటన జరిగింది.
Bihar train accident
వివరాల్లోకి వెళితే.. బెగుసరాయ్ జిల్లాలోని సాహెబ్‌పూర్ కమల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరౌని-కటిహార్ రైల్వే సెక్షన్‌లో ఈ ప్రమాదం జరిగింది. రహువా గ్రామానికి చెందిన కొందరు స్థానికంగా జరిగిన కాళీ మేళా (జాతర) చూసి బుధవారం రాత్రి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో రహువా గ్రామం సమీపంలో రైలు పట్టాలు దాటే ప్రయత్నం చేస్తుండగా.. అదే సమయంలో వేగంగా వస్తున్న అమ్రపాలి ఎక్స్‌ప్రెస్ రైలు వారిని ఢీకొట్టింది.
Woman, Daughter Among 4 Run Over By Train While Crossing Track In Biharhttps://t.co/KZS9vGVVvLpic.twitter.com/Fsmya3xFJw
— NDTV (@ndtv) October 23, 2025
ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను రీతా దేవి (40), ఆమె కుమార్తె రోష్ని కుమారి (14), ధర్మదేవ్ మహతో (35), ఏడేళ్ల చిన్నారి ఆరోహి కుమారి (ధర్మదేవ్ మహతో మేనకోడలు) గా పోలీసులు గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం, ఒకేసారి నలుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రమాదానికి గల కారణాలు స్థానికుల కథనం ప్రకారం.. రహువా గ్రామం వద్ద రైలు పట్టాల పక్కన నీరు నిలిచి ఉండటం వలన, ప్రయాణికులు పట్టాల మీద నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలోనే అమ్రపాలి ఎక్స్‌ప్రెస్ వేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు దాటేటప్పుడు ప్రజలు అజాగ్రత్తగా ఉండటం, అలాగే పండగల సమయంలో రైల్వే ట్రాక్‌ల వద్ద తగినంత భద్రత లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణాలుగా చెబుతున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద వార్తతో రహువా గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రైల్వే ట్రాక్‌లను దాటే విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.