Gunadala Flyover : గుణదల బ్రిడ్జికి మోక్షం ఎప్పుడు?.. మహాధర్నాకు సీపీఎం పిలుపు

వేలాది మంది ప్రజల రాకపోకలకు అవసరమైన విజయవాడ, గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి మొండి గోడలతో మిగిలిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబురావు ఫైర్‌ అయ్యారు. నేడు స్థానిక ప్రజలతో కలిసి బాబురావు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. మొండి గోడలపై 5354 రోజులు గుర్తు చేస్తూ అంకెలు వేసి, నిరసన తెలిపారు. ఈనెల 26వ తేదీన మహాధర్నాకు పిలుపు ఇచ్చారు.

New Update
Gunadala Flyover : గుణదల బ్రిడ్జికి మోక్షం ఎప్పుడు?.. మహాధర్నాకు సీపీఎం పిలుపు

ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. 2009 ఫిబ్రవరి19వ తేదీన గుణదల ఫ్లైఓవర్ కి శిలాఫలకం వేశారన్నారు. దీంతో నేటికి 5354 రోజులు, 14 సంవత్సరాల 8 నెలలు గడిచాయని మండిపడ్డారు. 3 ప్రభుత్వాలు, ఐదుగురు ముఖ్యమంత్రులు మారారన్నారు. 4 పిల్లర్లు వేసి సరిపెట్టారని ఫైర్‌ అయ్యారు. 10 సంవత్సరాలు పాటు శాసనసభ్యుడిగా ఉన్న మల్లాది విష్ణు ఈ బ్రిడ్జి గురించి శ్రద్ధ పెట్టడం లేదు కానీ.. సీఎం విశాఖపట్నం మకాం మారుస్తున్నానని ప్రకటించారని ధ్వజమెత్తారు. నాలుగున్నర ఏళ్లుగా  సీఎం జగన్ విజయవాడ, అమరావతిలో ఉండి ఏమి ఉద్ధరించారని ప్రశ్నించారు. విజయవాడ నగర అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. కనీసం మొండి గోడలతో ఉన్న ఫ్లైఓవర్‌ని కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ చేతకానితనానికి, అసమర్థతకు నిదర్శనంగా ఈ బ్రిడ్జి మిగిలిపోయిందన్నారు.

ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు జిల్లాల ప్రజానీకం ఈ దారిలో రాకపోకలు సాగిస్తారన్నారు. రైల్వే లైన్లు, బుడమేరు ఏలూరు, రైవస్ కాలువలు మీదుగా సాగాల్సిన ఫ్లైఓవర్ అతి గతి లేకుండా ఉందన్నారు. నగరానికి ఉత్తర ముఖ ద్వారంగా ఉన్న ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడాల్సిన బ్రిడ్జి పూర్తి కాకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు సాగడం లేదని తెలిపారు. విద్యార్థులు విద్యాలయాలకు వెళ్ళటానికి, ఉద్యోగులు కార్మికులు వెళ్లటానికి తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోందని తెలిపారు. ప్రతీ పది పదిహేను నిమిషాలకు రైల్వే గేటు పడి ప్రజలు నరకయాతన పడుతున్నారన్నారు. రైల్వే ట్రాక్‌పై వాహనాలు ఉండగానే రైళ్లు వచ్చి ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోనే పాఠశాలలు ఉన్నాయని.. రైల్వే లైన్‌పై ప్రమాదం జరిగి ఓ విద్యార్థి మరణించారని గుర్తు చేశారు.

ఎమ్మెల్యే మల్లాది విష్ణు పదేపదే గడువులు పెట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా..పని సాగలేదన్నారు. ఇప్పటివరకు కోర్టు కేసులు, భూ సేకరణ సాకు చూపి కాలయాపన చేస్తూ వచ్చారన్నారు. ఇప్పుడు భూసేకరణ పూర్తయినా నిధులు మంజూరు చేయలేదని సీహెచ్ బాబురావు అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి అక్టోబర్ 26న 3 వంతెనల వద్ద మహాధర్నాకు కమిటీ పిలుపునిచ్చింది. ఈ లోగా కరపత్రాలు పంపిణీ, ఇంటింటి ప్రచారం, పాదయాత్ర ద్వారా ప్రజలను సన్నద్ధం చేస్తున్నారు వ్యక్తిగత దరఖాస్తులను సేకరిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరాహార దీక్షలకు సిద్ధమని కమిటీ ప్రకటించింది. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి తక్షణమే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని వారు డిమాండ్‌ చేశారు.

ఇది కూడా చదవండి:  నారాయణస్వామిపై తెలుగు మహిళల ఆగ్రహం… క్షమాపణలు చెప్పాలంటూ ఫైర్

Advertisment
తాజా కథనాలు