Couple killed at Elephant Attack in Chittoor District: చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం రోజు రోజుకూ ఎక్కువవుతుంది. ఏనుగుల గుంపు తరచూ పంటలపై దాడి చేస్తూనే ఉన్నాయి. దీంతో అక్కడి పల్లె జనాలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. అడ్డుకోవడానికి వచ్చిన వారిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని గ్రామ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. తాజాగా గుడిపాల మండలంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో భార్యభర్తలు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మరొక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో బుధవారం ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగుల గుంపు నుంచి విడిపోయి గ్రామ సమీపంలోని పొలాలపై పడింది. రామాపురం గ్రామంలోని పొలంలో పనిచేస్తున్న వెంకటేష్ (50), సెల్వి(40) దంపతులపై ఏనుగు దాడి చేయడంతో.. వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత సీకే పల్లె లో మామిడి తోటలో కార్తీక్(24) అనే యువకుడి పై ఏనుగు దాడి చేయగా.. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం సీఎంసీ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం కార్తీక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఒంటరి ఏనుగును అటవీ ప్రాంతంలోకి తరిమేయడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా ఇటీవల చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు ఎక్కువయ్యాయి. వీటిని అరికట్టడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఇసుక పాలసీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు ఆందోళనలు.. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు