Russia mission failed, chandrayaan near to success: అంతరిక్షంలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన రష్యా.. చంద్రుడి విషయంలో మాత్రం ఎందుకు ఫెయిల్ అవుతుంది? అంతరిక్షంలో ప్రయోగాలు మొదలుపెట్టిందే నాటి సోవియట్ యూనియన్(USSR) కదా. స్పెస్‌లో ప్రపంచానికే కొత్త పాఠాలు నేర్పిన సోవియట్.. మూన్ రేస్‌లో మాత్రం వెనకపడిపోయింది. రష్యా ప్రయోగించిన లూనా-25(Luna-25) స్పేస్ క్రాఫ్ట్ ల్యాండర్ చంద్రుడిపై కూలిపోయింది. చంద్రుడిపై దిగే సమయంలో ల్యాండర్ క్రాష్ అయ్యింది. దాదాపు అర్థ శతాబ్దం తర్వాత జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగం చేపట్టగా అది కాస్త బెడిసికొట్టింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 కంటే రెండు రోజుల ముందుగానే లూనా-25(Luna-25) చంద్రుని దక్షిణ ధృవం మీద ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. రష్యా సైంటిస్టుల ప్లాన్ ఫెయిల్ అయ్యింది.
➼ అమెరికా కాదు.. ఇందులో రష్యానే తోపు:
పోటీ ఏదైనా.. రంగం ఏదైనా ఫస్ట్ ఎవరన్నదాన్నే ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది. అంతరిక్ష ప్రయోగాల గురించి చర్చ వచ్చిన ప్రతీసారి రష్యా(నాటి సోవియట్) గొప్పతనం వినిపిస్తూనే ఉంటుంది. కంటికి కనిపిస్తూనే ఉంటుంది. అంతరిక్ష యుగం ప్రారంభ రోజులలోనే సోవియట్ సత్తా చాటింది. ప్రపంచానికే దశ, దిశ చూపింది. ఏ రంగంలోనైనా అమెరికాపై ఆధిపత్యం చెలాయించడం అసాధ్యమనే భావన పెన వేసుకుని ఉన్న నాటి కాలంలో సోవియట్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అంతరిక్షానికి కొత్త దారులను చూపించింది. చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ గాల్లోకి రయ్‌రమ్‌మంటూ సోవియట్ రాకెట్లు దూసుకుపోయాయి.
➼ రష్యా లిస్ట్‌లో ఉన్న ఫస్ట్‌లు:
➊ అక్టోబరు 4, 1957.. మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహమైన స్పుత్నిక్-1తో రష్యా అంతరిక్ష ప్రయోగాలు ప్రారంభమయ్యాయి.
➋ సెప్టెంబరు 14, 1959.. లూనా 2 సోవియట్ మూన్ ప్రోబ్: నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపై నడవడానికి 10ఏళ్ల ముందే.. సోవియట్ చంద్రుడిని చేరుకుంది.
➌ ఆగస్టు 19, 1960.. బెల్కా, స్ట్రెల్కా అనే కుక్కలను వోస్టాక్ అనే అంతరిక్ష నౌకలో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది రష్యా
➍ ఏప్రిల్ 12, 1961.. ఒక మనిషిని కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ప్రపంచ చరిత్రలో అదే తొలిసారి. యూరి గగారిన్ వోస్టాక్ వ్యోమనౌకలో స్పెస్‌లోకి వెళ్లిన తొలి మానవుడిగా ప్రపంచంచేత జేజేలు అందుకున్నాడు.
➎ జూన్ 16, 1963.. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మహిళ- వాలెంటినా తెరేష్కోవా
➏ మార్చి 18, 1965.. మొదటి అంతరిక్ష నడక- అలెక్సీ లియోనోవ్
➼ ఫస్ట్ ఇజ్ బెస్ట్.. కానీ:
నిజానికి చంద్రునిపై మొట్టమొదటి సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది నాటి సోవియట్ యూనియనే.. మొదటి మూన్ రోవర్ వారిదే. అయితే చంద్రుడిపై వ్యోమగామిని దింపడంలో మాత్రం రష్యా కంటే అమెరికా దూకుడిగా వ్యవహరించింది. అపోలో-11 వ్యోమనౌక ద్వారా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, మైకెల్ కొల్లిన్స్, ఎడ్విన్ అల్డ్రిన్‌ను జులై 20, 1969న చంద్రుడిపైకి పంపింది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా. నిజానికి అమెరికా అంతరిక్ష ప్రయోగాలకు స్పూర్తి సోవియట్ యూనియనే. 1959లో లూనా-2 ద్వారా చంద్రుడిపై తొలిసారి ఉపగ్రహాన్ని పంపి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన సోవియట్‌ని చూసి అమెరికా ఈ స్పెస్‌రేస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 1961లో నాటి అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నెడీ చంద్రుడిపై వ్యోమగాములను పంపుతామని ప్రకటించారు. అప్పటి నుంచే రష్యాకు ధీటుగా అమెరికా తన అంతరిక్ష ప్రయోగాలకు పదునుపెట్టింది. అదే సమయంలో సోవియట్ డిఫెన్స్ ఇండస్ట్రీ అస్తవ్యస్తమైంది. సోషలిస్ట్ కంట్రి కావడంతో ప్రతి విషయానికి కచ్చితమైన అనుమతి తప్పనిసరిగా ఉండడంతో నాటి సోవియట్ సైంటిస్టకు అమెరికాతో పోల్చితే వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేకుండా పోయింది. అయినా కూడా సోవియట్ సైంటిస్టులు వెనక్కి తగ్గలేదు. తమ ప్రయోగాలను కొనసాగించారు.
➼ డౌన్ ఫాల్ స్టార్ట్:
మార్స్ రోవర్.. క్యూరియాసిటీ లాంటివి కొద్ది కాలం కిందటే ప్రపంచానికి తెలుసు. అయితే సోవియట్ యూనియన్ 1970లో చంద్రునిపై రోబోటిక్ కంట్రోల్ రోవర్‌ను ల్యాండ్ చేసి చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలో ఇంతటి ఘన చరిత్ర కలిగిన రష్యా.. క్రమక్రమంగా ఫెయిల్యూర్స్‌ని చూడడం మొదలుపెట్టింది. చంద్రుడిపై ప్రయోగాలను 47ఏళ్ల క్రితమే ఆపేసింది. 1991లో సోవియట్ రష్యాగా మారింది. అంతకముందు మూడు మొదటి తరం స్టేషన్లను కక్ష్యను పంపించడంలో ఈ సోషలిస్ట్ కంట్రి విఫలమైంది.
➼ ఇటివలి కాలంలో ముఖ్యంగా 2010 తర్వాత రష్యా అంతరిక్షంలో ఎక్కువగా ఓటములను చవచూసింది. సోయుజ్, ప్రోటాన్, రోకోట్.. ఇలా చాలా ప్రయోగాల్లో రష్యా ఫెయిల్ అయ్యింది. ఈ వైఫల్యాలపై క్రెమ్లిన్ ఏకంగా దర్యాప్తు చేస్తుందంటే పుతిన్‌ని ఈ ఫెయిల్యూర్స్ ఎంత వెంటాడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక తాజాగా లూనా-25 కూడా ఫెయిల్ అవ్వడం మూన్ రేస్‌లో రష్యాను మరింత వెనక్కి నెట్టింది. ఇదే సమయంలో చంద్రయాన్-3(Chandrayaan) సక్సెస్‌కు దగ్గరపడడం.. భారత్ విజయం ఆల్‌మోస్ట్ ఖాయం అవ్వడం పుతిన్‌కి పుండుపై కారం చల్లినట్టుగా మారింది.
➼ ఇది ఇండియా గెలుపే బాసూ:
ఓవైపు లూనా-25 చంద్రుడిపై ల్యాండ్ అవ్వడంలో ఫెయిల్ అవ్వగా.. మరోవైపు చంద్రయాన్-3 జాబిల్లికి మరింత చేరువైంది. అనుకున్న టైమ్‌కి (ఆగస్టు 23- సాయంత్రం 6.04 సమయంలో) చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టనుంది