Telangana Elections: తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఓటర్లను ప్రలోభ పెడుతోందని, పెద్దు ఎత్తున డబ్బుల పంపిణీ చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy). ఈమేరకు ఎన్నికల సంఘానికి ఆయన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని డబ్బు పంపిణీ చేపడుతున్న బీఆర్ఎస్‌ను తక్షణమే అడ్డుకోవాలని, తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉత్తమ్. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు ఎంపీ ఉత్తమ్. ఎన్నికల వేళ అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. 2018లోనూ ఇలాగే వ్యవహరించారని, ఇప్పుడూ అలాగే చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ డబ్బులను నేరుగా ప్రజల ఖాతాల్లోనే జమ చేస్తూ పంపిణీ చేస్తోందని ఆరోపించారు ఉత్తమ్. ఇలా అనేక ఎన్నికల సందర్భాల్లోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాగే చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ.
ఇదే విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. పథకాల పేరుతో ప్రజలకు నగదు పంపిణీని అడ్డుకోవాలని ఈసీని కోరామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు ఇలాంటి పథకాలను అపేయాలని కోరారు. కాగా, తెలంగాణలో నవంబర్ 30వ తేదీన ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. దాంతో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ప్రచారం పర్వంలో దూసుకుపోతున్నాయి. ఓటర్లను తమవైపు లాగేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదికూడా చదవండి: అత్యధి మైలేజీ కార్ల కోసం చూస్తున్నారా? బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్ల వివరాలు మీకోసం..
సీటు దక్కని అభ్యర్థులకు బుజ్జగింపులు..
గోశామహల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసేందుకు ప్రయత్నించిన మెట్టు సాయి కుమార్‌ను బుజ్జగించారు ఆ పార్టీ సీనియర్ నేతలు. మల్లు రవి సహా ఇతర నేతలు సాయి కుమార్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కూ దక్కని సీటు..?!
తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్‌ను పిలిచి మాట్లాడారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేసి వేణుగోపాల్. నిజామాబాద్ టౌన్ అసెంబ్లీ స్థానం ముస్లిం అభ్యర్దికి ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఈ విషయంలోనే మహేష్ గౌడ్‌ను పిలిచి ఒప్పించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం. పార్టీ స్క్రీనింగ్ కమిటీతో మహేశ్ కుమార్ గౌడ్ చర్చలు జరిపారు. కేసీ వేణు గోపాల్ ఆయనతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. దీన్ని బట్టి చూస్తుంటే.. సెకండ్ లిస్ట్‌లో మహేష్ కుమార్‌కు సీటు దక్కదనే తేలిపోయింది.
ఇదికూడా చదవండి: వాసివాడి తస్సాదియ్యా.. పొలిటికల్ పార్టీల పెండ్లి.. శుభలేఖ చూస్తే అవాక్కవ్వాల్సిందే..!