కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత రామప్ప ఆలయం నుంచి కాంగ్రెస్ విజయభేరీ యాత్రను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభకు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేర్చాలని సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఓ రోడ్ మ్యాప్‌ను రూపొదించిందని అన్నారు. తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పెరిగిన నిత్యవసరాల ధరలతో ప్రజల పరిస్థితిని అర్థం చేసుకున్నామని.. అందుకోసమే రూ.500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో 40 లక్షల మంది యువత ఉద్యోగాల కోసం నిరీక్షిస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం చేస్తోందంటూ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. అలాగే నిరుద్యోగ భృతిని అందజేస్తామన్నారు.
Also read: బీజేపీతో కలిసి పోటీ చేస్తారా లేదా మద్దతిచ్చి తప్పుకుంటారా.. పవన్ దారెటు..
అలాగే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తామని ప్రకటించారు. అన్ని పంటలకు మద్ధతు ధర కంటే ఎక్కువగా చెల్లిస్తామని పేర్కొన్నారు. ప్రతి రైతుకు ఏటా రూ.15 వేల రూపాయలు చెల్లిస్తామని.. భూమి లేని వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని తెలిపారు. అంబేద్కర్ అభయహస్తం కింద ఎస్సీలకు రూ.12 లక్షలు సహాయం చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసిపోయాయని.. బీఆర్ఎస్ ప్రభుత్వం రిమోట్ మోదీ చేతిలో ఉందని ఆరోపించారు. ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, వైన్ మాఫియా రాష్ట్రంలో పెరిగిపోయిందని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు వందల కోట్లు లూటీ చేసి భారీ భవనాలు కట్టుకున్నారని విమర్శించారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని అన్నారు. జనాభా పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలకు న్యాయం జరగడం లేదని అన్నారు.అందుకే దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు.