Telangana : తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి తెలంగాణలోని షాపులు, ఇతర వ్యాపార సంస్థలన్ని కూడా 10.30 కల్లా మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితి గురించి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ సూచనల మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
రాష్ట్రంలో గత కొంతకాలంగా నేరాల తీవ్రత పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాత్రుళ్లు అనవసరంగా వీధుల్లో తిరగొద్దని పోలీసులు సూచించారు. తెలియని వారికి వాహనాల్లో లిఫ్ట్ ఇవ్వొద్దని అన్నారు. రాత్రుళ్లు పబ్లిక్ ప్లేసుల్లో మద్యం తాగేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
అయితే పోలీసుల ఆదేశాలపై వ్యాపారులు, ప్రజలు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని నైట్‌లైఫ్ (Night Life) పై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. చార్మినార్ దగ్గర అర్ధరాత్రి వరకూ జనాల సందడి ఉంటుందని స్థానిక వ్యాపారి ఒకరు అన్నారు. ‘‘ప్రభుత్వం నేరాలను నియంత్రించాలి కానీ ఇలాంటి చర్యలతో ప్రజలకు నష్టం కలగకూడదు’’ అని అన్నారు.
నగర ప్రజల అభిరుచులు మారుతున్నాయని, సాయంత్రం వేళల్లో కుటుంబంతో సహా విహరించేందుకు ఆసక్తి చూపుతున్నారని మరో వ్యాపారి అన్నారు. షాపులు మూసేసే సమయంలో అనేక మంది కస్టమర్లు హడావుడిగా షాపులకు వస్తుంటారని, కాబట్టి అర్ధరాత్రి వరకూ షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతించాలని వ్యాపారస్తులు కోరుతున్నారు.