CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) నాయుడుతో పోటీ పడి పని చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ 24వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయన స్వర్గం నుంచి ఆశీర్వదిస్తారు..
ఈ మేరకు ఎన్టీఆర్ ఆలోచనతో ఏర్పడ్డ బసవతారకం ఆసుపత్రి (Basavatarakam Cancer Hospital) 24ఏళ్లుగా కోట్లాది మందికి సేవలందించడం సంతోషం ఉందన్నారు. పేదలకు సేవలందించే ఉద్దేశంతో ఆనాడు ఎన్టీఆర్ (NTR) ఈ ఆసుపత్రి నిర్మాణానికి పూనుకున్నారని, ఎన్టీఆర్ ఆలోచన విధానాలను కొనసాగించాలని చంద్రబాబు నాయుడు ఆసుపత్రిని పూర్తి చేసి పేదలకు సేవలు అందించేలా చేశారని కొనియాడారు. పేదలకు వైద్య సేవలు అందించాలన్న ఎన్టీఆర్ ఆలోచనలు అమలవుతున్న తీరు చూసి ఆయన మనల్ని స్వర్గం నుంచి ఆశీర్వదిస్తారు. ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా మా ప్రభుత్వం అండగా ఉంటుంది. అభివృద్ధి, సంక్షేమంలో ప్రపంచానికి తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలవాలని అన్నారు.
ఎన్టీఆర్ ఇచ్చిన వారసత్వం..
ఇక తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం ఆలోచిస్తోంది. అన్ని రకాల వైద్య సేవలు అందేలా హెల్త్ టూరిజం హబ్ ముందుకెళ్తుంది. ఇందులో బసవతారకం ఆసుపత్రికి చోటు ఖచ్చితంగా ఉంటుంది. వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్ కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందుతాయనేలా తీర్చిదిద్దుతాం. రాజకీయం, సంక్షేమం ఎన్టీఆర్ వారసత్వంగా ఇచ్చారు. ఎన్టీఆర్ మూడో తరం కూడా దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read: ఏపీలో కల్కీ టికెట్ ధర రూ.400.. ప్రభాస్ నిర్మాతకు చంద్రబాబు శుభవార్త?