CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. గత ప్రభుత్వం కాళేశ్వరం అద్భుతం అని చెప్పే ప్రయత్నం చేస్తోందని చురకలంటించారు. ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారు? ఎన్ని రుణాలు తీసుకున్నారన్న వివరాలు బయటకు తీస్తామని స్పష్టం చేశారు.
Also Read: 20 ఏళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న.. ప్రధాని మోడీ
కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతం అని సభను హరీశ్ రావు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొమ్మిదిన్నరేళ్లు సాగునీటి శాఖ కేసీఆర్ కుటుంబం ఆధీనంలోనే ఉందని అయితే ప్రజల్ని మభ్యపెట్టడానికి కేసీఆర్ కుటుంబం ప్రయత్నం చేస్తోందన్నారు. కేవలం కాళేశ్వరం కోసమే రూ. 80 వేల కోట్ల రుణం తీసుకున్నారని.. ఇవి మాత్రమే కాకుండా ప్రభుత్వం కొన్ని నిధులు ఖర్చు పెట్టిందని వెల్లడించారు.
కాళేశ్వరంపై వచ్చే ఆదాయంతో అప్పులు చెల్లిస్తామని చెప్పి రుణాలు తీసుకున్నారన్నారు. మిషన్ భగీరథ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తామని చూపించి కార్పొరేషన్ల అప్పులకు సంతకాలు పెట్టారని..అయితే ఆ సంతకాలు పెట్టింది ఎవరు? అని ప్రశ్నించారు. ఆదాయంతోనే అప్పులు చెల్లిస్తామని బ్యాంకులకు తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.