Rythu Runa Mafi: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. భేటీలో పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. రైతు రుణమాఫీ అమలుపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. గత డిసెంబర్ 9 వరకున్న రుణాలకు మాఫీ వర్తింపు అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. కాగా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు చెబుతున్న విషయం తెలిసిందే.
సోనియాగాంధీ పుట్టిన రోజుతో పాటు తెలంగాణ ప్రకటన తేదీ కావడంతో రేవంత్ సర్కారు సెంటిమెంట్ గా పెట్టుకుంది. రైతు కాకుండా రైతు కుటుంబం యూనిట్‌గా అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వడ్డీతో కలిపి రుణమాఫీ చేసేందుకు దాదాపు రూ. 40వేల కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. ఒకేసారి రుణమాఫీ సాధ్యాసాధ్యాలపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. మార్గదర్శకాల రూపకల్పనపై అధికారుల కసరత్తు చేస్తున్నారు.