ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ఒకే సారి ప్రకటించి దూకుడు మీద ఉంది అధికార బీఆర్ఎస్ (BRS ). ఆ పార్టీ ఇద్దరు కీలక నేతలు హరీశ్ రావు (Harish Rao), కేటీఆర్ (KTR) నిత్యం అనేక నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గులాబీ బాస్ కేసీఆర్ (CM KCR) సైతం ఇక ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వరుస మీటింగ్ లతో ఆయన రాష్ట్రాన్ని చుట్టేయనున్నారు. పార్టీ అభ్యర్థులకు ఈనెల 15న సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో బీఫామ్ లను అందజేయనున్నారు. అనంతరం వారితో సమావేశమై ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై దిశానిర్ధేశం చేస్తారు. అనంతరం పార్టీ మేనిఫెస్టోను సైతం సీఎం విడుదల చేసే అవకాశం ఉంది. అదే రోజు హుస్నాబాద్ సభలో సీఎం పాల్గొంటారు. హుస్నాబాద్ లో తొలి ఎన్నికల మీటింగ్ నిర్వహించడం సీఎం కేసీఆర్ సెంటిమెంట్ గా భావిస్తారు. గత ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే కేసీఆర్ ఎన్నికల సమరశంఖం పూరించారు. 15, 16, 17, 18 తేదీల్లో కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తారు. నవంబర్ 9న కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో నామినేషన్ వేయనున్నారు కేసీఆర్.
ఇది కూడా చదవండి: Telangana BJP-Amit Shah: రేపు తెలంగాణకు అమిత్ షా.. షెడ్యూల్ ఇదే!
కేసీఆర్ జిల్లాల పర్యటన వివరాలు:
- అక్టోబర్ 16న జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.
- 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.
- అక్టోబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో.. అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
కేసీఆర్ నామినేషన్ ఎప్పుడంటే?
- నవంబర్ 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు.
- నామినేషన్ కు ముందు ఈ నెల 9న ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి సెంటిమెంట్ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
- అనంతరం గజ్వేల్ లో సీఎం కేసీఆర్ మొదటి నామినేషన్ వేస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేస్తారు.
- తర్వాత 3 గంటలకు కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.