తెలంగాణ పూల పండుగ బతుకమ్మ వేడుకల ముగింపు రోజు “సద్దుల బతుకమ్మ” (Saddula Bathukamma) సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన విధానంలో నుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ అని సీఎం అన్నారు. పువ్వులే బతుకమ్మగా పూజలందుకోవడం తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధనను, కృతజ్ఞతా భావనను తెలియజేస్తుందని సీఎం అభివర్ణించారు. సబ్బండ వర్గాల ప్రజలు సమిష్టిగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనదని సీఎం తెలిపారు.
ఇది కూడా చదవండి: Batukamma:గౌరమ్మను తల్లి గంగమ్మ ఒడిలో వదిలేసే సద్దుల బతుకమ్మ
పచ్చదనం, పాడి పంటలు, పశుసంపద, ప్రకృతి వనరులతో నేడు తెలంగాణ రాష్ట్రం నిండైన బతుకమ్మను తలపిస్తోందని సీఎం అన్నారు. బతుకమ్మల నిమజ్జన సమయంలో స్వీయ జాగ్రత్తలతో పాటు, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఆనందోత్సాహాలతో సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని జగన్మాత గౌరీదేవిని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రార్థించారు.
సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. రాజధాని ట్యాంక్ బండ్ పై ఘనంగా ఏర్పాట్లు చేసింది జీహెచ్ఎంసీ. ట్యాంక్ బండ్ ప్రాంతమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు అధికారులు. ముందు జాగ్రత్తగా వంద మందికి పైగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. బతుకమ్మల నిమజ్జనం కోసం నీటి కొలనులను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పోలీసులు వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి అనుసంధానం చేశారు. భారీగా మహిళలు తరలివస్తున్న నేపథ్యంలో షీ టీమ్స్‌తోపాటూ వందల మంది పోలీసులతో నిఘా ఏర్పాటు చేశారు.