CM Chandrababu: నేడు కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖలపై (Excise Department) అధికారులతో సమీక్షించనున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనపై సమీక్ష చేయనున్నారు.
గిరిజన శాఖపై సమీక్ష...
ఏపీలోని గిరిజన ప్రాంతాల్లో (Tribal Areas) రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ముఖ్యమంత్రి అన్నారు. అవసరమైన మౌళిక వసతులు కల్పించడం ద్వారా, ఫీడర్ అంబులెన్స్ లను తిరిగి ప్రవేశ పెట్టడం ద్వారా రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చూడాలని అన్నారు.
అలాగే నెలలు నిండిన గర్భిణీల (Pregnant Women) కోసం గతంలో తెలుగు దేశం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలన్నారు. తద్వారా గిరిజన మహిళలకు మేలు జరుగుతుందని చంద్రబాబు చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈమేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై జరిపిన సమీక్షలో గిరిజనులకు విద్యా, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సియం సమీక్షించారు.