Batti Vikramarka: ముఖ్యమంత్రి పదవిపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తంచేసిన ఆయన బీఆర్ఎస్ పాలనపై విమర్శలు సంధించారు. ముఖ్యమంత్రి పదవిని ఎవరైనా ఆశించవచ్చని, అందులో తప్పేమీ లేదని అన్నారు. అయితే, అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి స్థానాన్ని ఎవరికి కట్టబెట్టాలన్న అంశమై అధిష్ఠానానిదే తుదినిర్ణయమన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే లోకసభ ఎన్నికల్లోను కాంగ్రెస్ విజయం తథ్యమన్నారు.
ఇది కూడా చదవండి: వచ్చే ఏడాది నుంచి తెలంగాణ మొత్తం తిరుగుతా: హన్మకొండ బీజేపీ సభలో పవన్ కల్యాణ్
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే కేసీఆర్ అవినీతిపై దర్యాఫ్తు జరిపిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన సమయంలో చేసిన అభివృద్ధే ఇప్పటికీ కనిపిస్తోందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ వైఫల్యం ప్రభుత్వ పనితీరును తేటతెల్లం చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ అదనంగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేకపోయారని దుయ్యబట్టారు. దేశంలోనే ధరణి అతిపెద్ద కుంభకోణమన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలతో ప్రభంజనం సృష్టించబోతోందని జోస్యం చెప్పారు. 80కి పైగా సీట్లను కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయమన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ తెలంగాణకు అదనంగా నాలుగు శాతం విద్యుత్ కేటాయించినట్లు చెప్పారు.