మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలో పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఛత్తీస్ ఘడ్ లో 38.22 శాతం, మధ్య ప్రదేశ్ లో 45.40 శాతం పోలింగ్ నమోదయింది. ఇక్కడ బాలాఘాట్, మండల, దిండోరి జిల్లాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనుపమ్ రాజన్ తెలిపారు. కాగా, మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాజిమ్ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత బింద్రానవగఢ్ సీటులోని తొమ్మిది పోలింగ్ కేంద్రాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్దిష్ట ప్రాంతంలో ఓటింగ్ జరుగుతుంది.
అయితే మధ్య ప్రదేశ్ లో అక్కడాక్కడా పోలింగ్ కేంద్రాల దగ్గర అల్లర్లు జరిగాయి. భింద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ నేతలు రాళ్ళు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో బీజేపీ నేత రాకేశ్ శుకా గాయపడ్డారు. ఆయన కార్ అద్దాలు కూడా ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
జబువాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. బీజేపీ కార్యకర్తలే రాళ్లు రువ్వారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇది గూండా రాజ్యం అంటూ మండి పడింది. చింద్వారాలోని బరారిపుర ప్రాంతంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కొడుకు, కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్‌ని పోలింగ్ బూత్ వద్ద అడ్డుకోవడం కలకలం సృష్టించింది. పోలింగ్ బూత్‌లోకి అడుగు పెట్టకుండా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. మరోవైపు మొరెనా జిల్లా దిమాని అసెంబ్లీ మిర్ఘన్ గ్రామంలో జరిగిన వివాదంలో మళ్లీ రాళ్ల దాడి జరగడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన కొందరు రౌడీలు ప్రజలపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఓటింగ్ ముగించుకుని వస్తున్న ఇండియన్ నేవీ జవాను సహా ముగ్గురు వ్యక్తులు రాళ్లదాడిలో గాయపడ్డారు. గ్రామంలో పోలీసు బలగాలు ఉన్నాయి. పోలీసులు ఇంటింటికీ సోదాలు నిర్వహిస్తున్నారు. దీనివలన పోలింగ్ కేంద్రంలో ఓటింగ్‌పై ప్రభావం పడుతోంది.ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం ప్రస్తుతానికి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.