/rtv/media/media_files/2025/07/26/murali-and-shoban-2025-07-26-15-44-46.jpg)
సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి కానీ కొన్ని సినిమాలు మాత్రం కల్ట్ క్లాసిక్ గా నిలబడుతాయి. అలాంటి కొన్ని సినిమాల్లో అతడు ఒకటి. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రకం 2005 ఆగస్టు 10న విడుదలై సూపర్ హిట్ అయింది. జయభేరి ఆర్ట్స్ పతాకంపై దుగ్గిరాల కిషోర్, ఎం. రామ్మోహన్, నటుడు మురళీ మోహన్ ఈ సినిమాను నిర్మించారు. 2025 ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా 4K, IMAX, డాల్బీ, సూపర్ 4K ఫార్మాట్లలో, ఒరిజినల్ సౌండ్ ట్రాక్ టెక్నాలజీతో రీ-రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిర్మాత మురళీ మోహన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
మేనేజర్‌కు బ్లాంక్ చెక్ ఇచ్చి
ఈ సినిమాలో నటుడు నాజర్ పోషించిన సత్యనారాయణ మూర్తి పాత్రను ముందుగా అలనాటి హీరో శోభన్ బాబుతో చేయించాలని అనుకున్నారట మురళీ మోహన్. ఆయన మేనేజర్‌కు బ్లాంక్ చెక్ ఇచ్చి శోభన్ బాబు ఇంటికి కూడా పంపించారట. రెమ్యునరేషన్ ఎంతైనా ఫర్వాలేదని చెప్పామని... కానీ, ఆయన అంగీకరించలేదట. అయితే ఈ పాత్ర చేయకపోవడానికి కూడా ఆయన కారణాన్ని వెల్లడించారు. ‘నేను ప్రేక్షకులకు ఎప్పటికీ హీరోగానే గుర్తుండాలి. తండ్రి, తాత పాత్రల్లో గుర్తుపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు’ అని చెప్పారట. ఈ విషయాన్ని మురళీ మోహన్ తెలిపారు. ఇక శోభన్ బాబు 1996లోనే సినీ రంగం నుండి పూర్తిగా రిటైర్ అయ్యారు. ఆయన చివరి సినిమా 1992లో విడుదలైన బలరామకృష్ణులు. సినిమా పరిశ్రమకు పూర్తిగా దూరం అయ్యాక తన వ్యక్తిగత జీవితం, రియల్ ఎస్టేట్ వ్యాపారంపై దృష్టి పెట్టారు. 2008లో ఆయన మరణించారు.
ఇక అతడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. 2005వ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు మూడు నంది అవార్డులు, ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు (త్రివిక్రమ్ శ్రీనివాస్) గెలుచుకుంది. ఈ సినిమా టీవీలో అత్యధిక సార్లు (దాదాపు 1500 సార్లకు పైగా) ప్రసారమైంది. టీవీలో ప్రసారమైన ప్రతిసారీ మంచి టీఆర్పీ రేటింగ్ లను సాధించి రికార్డు సృష్టించింది.