టాలీవుడ్ నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చయాంశమైన సంగతి తెలిసిందే. నాగచైతన్య, సామ్ విడాకులపై కొండా సురేఖ మాట్లాడిన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సినీ ఇండస్ట్రీ నుంచి స్టార్ సెలబ్రిటీలు సమంతకు మద్దతుగా నిలిచారు.
ఈ కామెంట్స్‌పై టాలీవుడ్ సెలబ్రిటీలు చిరంజీవి, నాని, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేశ్, మంచు లక్ష్మి, సుధీర్ బాబు, మహేష్ బాబు, రవితేజ.. ఇలా చాలామంది రియాక్ట్ అయ్యారు. తాజాగా ఈ వివాదంపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సైతం స్పందించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ దాని సృజనాత్మకత, వృత్తి నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
నేను ఈ అందమైన పరిశ్రమలో గొప్ప ప్రయాణం చేసాను. ఈ పరిశ్రమతో ఇప్పటికీ చాలా కనెక్ట్ అయి ఉన్నాను. ఇటువంటి ఇండస్ట్రీలో మహిళల గురించి నిరాధారమైన దుర్మార్గమైన పుకార్లు వినడం బాధాకరంగా ఉంది. మరి దారుణమైన విషయం ఏంటంటే అవి ఇంకొక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళ నుండి వినడం ఇంకా మనసు విరిచేసేలా ఉంది.
నాకు ఎలాంటి సంబంధం లేదు..
గౌరవం కోసం మనం నోరు తెరవకుండా ఉంటే దాన్ని మా బలహీనతగా చూస్తున్నారు. నాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో కానీ పార్టీలతో కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. నా పేరు ని తప్పుడు ఆరోపణలతో మీ రాజకీయాల కోసం వాడుకోవడం ఆపేయండి. ఆర్టిస్ట్‌లను ఈ రాజకీయాల నుంచి దూరంగా ఉంచండి. రాజకీయ విమర్శల కోసం, న్యూస్ హెడ్‌లైన్‌ల కోసం అర్థం లేని కథల్లో మమ్మల్ని లాగకండి" అంటూ తన పోస్ట్ లో పేర్కొంది.