తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ..' డియర్ పవన్ కల్యాణ్, ఇది జరిగింది మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే, దోషులెవరో పట్టుకుని కఠినంగా శిక్షించండి.
ఎందుకు దేశమంతటా భయాందోళనలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు? కేంద్రంలోని మీ మిత్రుల పుణ్యమా అని దేశంలో ఇప్పటికే మతపరమైన టెన్షన్లు చాలా ఉన్నాయి' అంటూ తిరుమల లడ్డూ వివాదంపై ట్వీట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ ను ఉద్దేశిస్తూ మాట్లాడారు.' ప్రకాశ్‌రాజ్.. విషయం తెలుసుకుని మాట్లాడండి.. సున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్ విషయం తెలుసుకుని మాట్లాడాలి.
ఆయనతో పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు' అని అన్నారు. ఇక దీనిపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతూ.. ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో పవన్ కు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
Also Read : ఓవర్సీస్ లో 'దేవర' ర్యాంపేజ్.. రిలీజ్ కు ముందే రికార్డులు
విదేశాల్లో ఉన్నా, వచ్చాక చూసుకుందాం..
" పవన్ కల్యాణ్ గారు.. ఇప్పుడే మీ ప్రెస్‌మీట్ చూశా. నేను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా. ఈ నెల 30 తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా. ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి. అర్థం చేసుకోండి" అని అన్నారు.
మరోవైపు శ్రీవారి లడ్డూలో కల్తీ జరగడంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ గుడి మెట్లను శుభ్రపరిచి అమ్మవారికి సేవ చేసుకున్నారు. అనంతరం మీడియా ముందు లడ్డూ వివాదం గురించి మాట్లాడారు.