Nagababu: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు రావడం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అతని దగ్గర పనిచేసే మహిళా కొరియోగ్రాఫర్ ను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు, అత్యాచారానికి పాలపడినట్లు సంచలన విషయాలు బయటకొచ్చాయి. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు జానీ పై IPC 376, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న జానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవాలో అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు.
నాగబాబు సంచలన ట్వీట్
ఈ క్రమంలో తాజాగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన వరుస ట్వీట్లు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ”నేరం ఏదైనా కోర్టు నిర్ధారించేంత వరకు ఎవరూ నిందితులు కాదు. విన్న ప్రతిదీ నమ్మొద్దు, ప్రతి కథలోనూ 3 వెర్షన్లు ఉంటాయి.. ఒకటి మీది, రెండోది అవతలి వాళ్ళది, మూడోది నిజం" అని వరుస ట్వీట్లు చేశారు. దీంతో నాగబాబు చేసిన ట్వీట్లు జానీ మాస్టర్ పై వస్తున్న ఆరోపణలను ఉద్దేశించెనా..? అనే కోణంలో చర్చ జరుగుతోంది. జానీ ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున అతని నియోజకవర్గం నెల్లూరులో విస్తృతంగా ప్రచారం చేశాడు. అంతే కాదు పార్టీ అతనికి రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు కూడా అప్పగించింది. ప్రస్తుతం జానీ పై ఆరోపణల నేపథ్యంలో పార్టీ అతన్ని విధుల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.